నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే ప్రతి రోజు 4 లక్షల 20 వేల మంది ఆక్యుపెన్సీతో హైదరాబాద్ మెట్రో దూసుకుపోతుంది. అయితే ఇప్పటివరకు నగరంలో ఆర్టీసీకీ, ఎంఎంటీసీ రైళ్లకు మాత్రమే నెలవారీ పాసులు అందుబాటులో ఉన్నాయి. అయితే మెట్రో రైలులో ప్రయాణించేవారికి మాత్రం నెలవారీ పాసులు లేవు. ఆర్టీసీ బస్‌లతో పోలిస్తే మెట్రో రైలు చార్జీలు రెట్టింపు ఉండడంతో ప్రయాణికులకు చార్జీల భారం పెరిగిపోతుంది. అందుకే మెట్రోలో కూడా మంత్లీ పాసుతో పాటు, మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌లకు కలిపి కామన్ టికెట్ అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా మెట్రో అధికారులు నూతన సంవత్సర కానుకగా జనవరి నుంచి మంత్లీ పాస్ సేవలను జారీ చేయాలని నిర్ణయించారు. దీని కోసం ఎల్‌అండ్‌టీ మెట్రో అధికారులు సంబంధిత సన్నాహాలను పూర్తి చేశారు. మంత్లీ పాస్‌కు సంబంధించి మార్గదర్శకాలను కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ మంత్లీ పాస్‌లను కేవలం స్టేషన్ల వారీగా జారీ చేయడం గమనార్హం. ఉదాహరణకు మియాపూర్ నుంచి ఖైరతాబాద్ స్టేషన్, తార్నాక – హైటెక్ సిటీ స్టేషన్ల వారీగా మంత్లీ పాస్‌లను ఇష్యూ చేస్తారు. ఇలా ఆర్టీసీ బస్‌పాసుల్లా కాకుండా స్టేషన్ల వారీ మంత్లీ పాస్‌లను జారీ చేయనున్నారు. మరోవైపు కామన్ టికెట్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మెట్రో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక కారిడార్ – 2 లో జేబీఎస్ – ఎంజీబీఎస్ లైన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత మంత్లీ పాసులను జారీ చేయనున్నారు. అయితే మంత్లీ పాస్‌ల ధరలను ఇంకా ప్రకటించకపోవడం గమనార్హం.