మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులను శంకర్, నరేశ్, మేఘవర్షిణి, జ్యోతిగా గుర్తించారు. ప్రమాదం గురించి తెలియగానే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఒకే కుటుంబానికి నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్షమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
