ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనను టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మూడు రాజధానుల కాన్సెప్ట్‌కు నిరసనగా అమరావతి ప్రాంతంలో టీడీపీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమరావతిని సీఎం జగన్ చంపేస్తున్నాడంటూ బాబు ఆక్రోశం వెళ్లగక్కుతున్నాడు. ఇదిలా ఉంటే అధికార, పరిపాలన వికేంద్రీకరణ దిశగా మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్ ఆలోచనను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరోక్షంగా సమర్థించారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో నీట్ స్నాతకోత్సవంలో వెంకయ్య నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూడు రాజధానుల ఏర్పాటుపై పరోక్షంగా స్పందించారు. రాజధానిలోనే అన్నీ ఉంటే అభివృద్ధి జరగదని, అభివృద్ది వికేంద్రీకరణ జరగాలని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రస్తుతం రాజధానిలో జరుగుతున్న ఆందోళనలకు తన వ్యాఖ్యలను ముడిపెట్టద్దు అంటూనే భారతదేశంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. పట్టణాల నుంచి గ్రామ స్థాయి అభివృద్ధి జరగాలని అభిలషించారు. దీంతో వెంకయ్యనాయుడు పరోక్షంగా సీఎం జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్‌కు మద్దతు పలికినట్లయింది. ఇప్పటికే జీవీయల్ నరసింహారావు, పురంధేశ్వరీ, సోమువీర్రాజు వంటి బీజేపీ నేతలు అధికార, పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతు పలికారు. తాజాగా వెంకయ్యనాయుడు కూడా ఇన్‌డైరెక్ట్‌గా మూడు రాజధానులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశగా మారింది. కాగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతిలో ఆందోళనలను రెచ్చగొడుతున్న చంద్రబాబుకు తనకు అత్యంత సన్నిహితుడైన వెంకయ్య నాయుడు.. మూడు రాజధానులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో మైండ్ బ్లాంక్ అయినట్లైంది.
