చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు రికార్డు స్థాయిలో 6 వ సారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 14 ఏళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పని చేసినా కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శూన్యం. చంద్రబాబు ఏనాడూ కుప్పం ప్రజల బాగోగులు పట్టించుకోకపోయినా…సీఎం స్థాయి వ్యక్తి కావడంతో ప్రజలు ఆయనపై అభిమానంతో ఓటేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం చంద్రబాబుకు వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి గట్టిపోటీ ఇచ్చారు. దీంతో స్వల్ఫ మెజారిటీతో చంద్రబాబు ఎన్నికల్లో గట్టెక్కారు. మూడోసారి ప్రతిపక్షనాయకుడిగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు అమరావతికే పరిమితం అయ్యారు. బాబుగారికి ఎప్పటికీ బంగారు బాతులాంటి అమరావతి కనిపిస్తుంది కానీ…అన్ని రంగాల్లో వెనుకబడిన కుప్పం మాత్రం ఆయనకు కనిపించదు. ఏదో అడపాదడపా కుప్పంకు చుట్టపు చూపుగా వెళ్లిరావడమే తప్ప..అక్కడ డెవలప్ గురించి చంద్రబాబు చిత్తశుద్ధితో వ్యవహరించిన దాఖలా లేదు. అందుకే కుప్పం ప్రజలు, వైసీపీ నేతలు మా ఎమ్మెల్యే చంద్రబాబు కనిపించడం లేదంటూ కుప్పం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 ఏళ్లుగా చంద్రబాబును కుప్పం నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తున్నారన్నారు. అయితే ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పం ప్రజలు తమ సమస్యలు చెప్పుకోడానికి కనీసం బాబు క్యాంప్ కార్యాలయం కూడా లేదన్నారు. సొంత నియోజకవర్గమైన చంద్రగిరి ప్రజలు బాబును ఓడిస్తే, అమాయకులైన కుప్పంవాసులు గెలిపిస్తూ వస్తున్నారన్నారు. కుప్పంలో కనీస సౌకర్యాలు కూడా లేవని వాపోయారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా కుప్పానికి ఏమీ చేయలేదని మండిపడ్డారు. పోలీసులు తమ ఎమ్మెల్యే ఆచూకీ తెలిపితే అక్కడికెళ్లి సమస్యలను చెప్పుకుంటామని వారు అన్నారు. కాగా మరోవైపు మంగళగిరి ఎమ్మెల్యే. తాడికొండ ఎమ్మెల్యేల ఆచూకీ తెలపాలని అక్కడి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజధాని రైతులు రోడ్డెక్కారని, వారి గోడు విని ఓ పరిష్కారాన్ని చూపాలని వారు విన్నవించారు. మొత్తంగా వైసీపీ, టీడీపీలు ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ ఒకరిమీద ఒకరు పోటీలు పడి ఫిర్యాదులు చేసుకోవడం ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తోంది.
