ఏపీకి మూడు రాజధానులపై సీఎం జగన్ చేసిన ప్రకటనను ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలతో సహా గోదావరి జిల్లాలు కూడా స్వాగతించాయి. అయితే ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో అదీ కూడా అమరావతి ప్రాంతంలోనే కొద్ది మంది రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళనలు చేస్తున్నారు. గత ఆరు రోజులుగా ధర్నాలు, ఆందోళనలతో అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా అమరావతిలో జరుగుతున్న ఆందోళనల వెనుక ఎవరున్నారనే విషయంపై ఏపీ పోలీస్ వర్గాలు ఆరా తీస్తున్నారని సమాచారం. ఈ మేరకు నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. గత ఐదేళ్లు చంద్రబాబు సింగపూర్‌ను తలదన్నే అద్భుత రాజధాని రాబోతుందంటూ…గ్రాఫిక్స్‌తో మభ్యపెట్టి మరీ రైతుల నుంచి భూములు లాక్కున్నాడు. ఇందులో టీడీపీ నేతలకు సంబంధించి 4 వేలకు పైగా ఎకరాలు ఉన్నట్లు సమాచారం. అంతే కాదు చంద్రబాబు రాజధాని భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. బినామీలతో రైతుల దగ్గర భూములు కొనుగోలు చేయించి…వేలాది కోట్లాది రూపాయలు టీడీపీ నేతలు గడించారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మూడు రాజధానుల ఏర్పాటుతో అమరావతిలో భూముల విలువ పడిపోతుందనే ఆందోళన బాబుగారి సామాజికవర్గానికి చెందిన రైతులు, టీడీపీ నేతల్లో నెలకొంది. అందుకే రైతులను, ప్రజలను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను టీడీపీ నేతలే రెచ్చగొట్టి అలజడులు రేకేత్తిస్తున్నారని తెలుస్తోంది. అమరావతిలో హోరెత్తుతున్న ధర్నాలు, నిరసనల వెనుక రాజధానికి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ కీలక నేత ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు ఆదేశాల మేరకు తెరవెనుక మంత్రాంగం నడుపుతూ..ఈ ఆందోళనలు చేయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కాగా ఈ కృత్రిమ ఉద్యమాన్ని వెనుక ఉండి నడిపిస్తున్నవారిని కనిపెట్టేందుకు ఏపీ ఇంటలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి.
