విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి స్వామి స్వాత్మానందేంద్ర చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర ఆదివారం నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఈయాత్ర 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జిల్లాలో ఉంటుంది. హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా స్వామీజీ జిల్లాలోని పుణ్యక్షేత్రాలతో పాటు హరిజనవాడలను కూడా సందర్శిస్తారు. విద్యాసంస్థలకు వెళ్లి విద్యార్థులకు హైందవ ధర్మం ప్రాధాన్యతను వివరిస్తారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం హైందవ సంప్రదాయాలను ప్రబోధిస్తూ ముందుకు సాగుతారు. నెల్లూరు జిల్లాలోకి అడుగు పెట్టిన యాత్రను నాయుడుపేటలో స్థానిక ప్రముఖులు రాజారెడ్డి ఘనంగా స్వాగతించారు. ఆదివారం ఉదయం నాయుడుపేటలోని పిచ్చిరెడ్డితోపులో విజయగణపతి ఆలయాన్ని సందర్శించి నెల్లూరు జిల్లాలో యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆదివారం విశాఖ శారదాపీఠం భక్తులు నాయుడుపేట వీధుల్లో స్వామిజీని ఊరేగించారు. విజయగణపతి ఆలయం నుంచి ప్రధాన మార్కెట్ వరకు ఈ ఊరేగింపు సాగింది. హిందువులంతా పెద్ద ఎత్తున ఇందులో భాగస్వామ్యులయ్యారు. శంకరాచార్యుని కీర్తిస్తూ పాటలు పాడారు. విశాఖ శారదాపీఠం భక్తులు స్వామి స్వాత్మానందేంద్రపై అడుగడుగునా పూల వర్షం కురిపించారు. మేళ తాళాల మధ్య కోలాటాలు, డప్పు నృత్యాలతో సాగిన యాత్ర నాయుడుపేట ప్రజలను కనువిందు చేసింది. ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ.. లోక కల్యాణార్థం యాత్ర చేపట్టినట్లు తెలిపారు. హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడమొక్కటే తన లక్ష్యమని స్పష్టం చేశారు. హైందవ ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా మారాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మ ప్రచార యాత్ర ఇప్పటికే తెలంగాణలో పూర్తయి, ఆంధ్రప్రదేశ్ లో 2700 కిలోమీటర్ల మేర సాగిందని చెప్పారు. ఆంధ్రలో తొలి విడత జనవరి 9వ తేదీ వరకు యాత్ర ఉంటుందని ఆ తర్వాత మలి విడతలో ఇచ్ఛాపురం వరకు సాగుతుందని వివరించారు. శంకరాచార్యుని పరంపరలో భాగంగా హిందూ ధర్మ ధర్మాన్ని ప్రబోధించడానికి దేశవ్యాప్తంగా యాత్ర సాగిస్తానని తెలిపారు. తన యాత్రకు అడుగడుగునా విశాఖ శారదాపీఠం భక్తులు, హిందూ ధార్మిక సంస్థలు బ్రహ్మరథం పడుతున్నాయన్నారు. స్వామిజీ వెంట యాత్ర ఆంధ్రప్రదేశ్ సమన్వయకర్త గోసుల శివభారత్ రెడ్డి తదితర భక్తులు ఉన్నారు.
