వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దాంతో టీమిండియా 2–1తో సిరీస్ నెగ్గింది. వెస్టిండీస్ నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 48.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ కోహ్లి (81 బంతుల్లో 85; 9 ఫోర్లు), రాహుల్ (89 బంతుల్లో 77; 8 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ (63 బంతుల్లో 63; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’… రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ లభించాయి. కాగా ఓ ఏడాదిలో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. 22 ఏళ్లుగా శ్రీలంక ఓపెనర్ సనత్ జయసూర్య (1997లో 2387 పరుగులు) పేరిట ఉన్న ఈ రికార్డును రోహిత్ విండీస్‌పై మూడో మ్యాచ్‌లో అధిగమించాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది రోహిత్ మూడు ఫార్మాట్‌లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి 2442 పరుగులు సాధించాడు. ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఈ ఏడాది 28 వన్డేలు ఆడి 1490 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కోహ్లి (1377), షై హోప్ (విండీస్–1345) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.