ఏపీకి మూడు రాజధానులపై సీఎం జగన్ చేసిన ప్రకటనను స్వాగతిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఒకపక్క పవన్ కల్యాణ్, నాగబాబు ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులకు మద్దతు ఇస్తుంటే చిరంజీవి మాత్రం సీఎం జగన్‌కు మద్దతు పలకడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే చిరు పేరుతో మరో లేఖ విడుదల అయింది. ఆ లేఖలో యావత్ ఆంధ్ర ప్రజానీకానికి సవినయంగా తెలియజేయునది..ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటును సమర్థిస్తూ కాని, వ్యతిరేకిస్తూ కాని, నేను ఏ విధమైన ప్రకటన చేయలేదు.తెలుగు ప్రజలకు చేరువ చేసి, నన్నింతవాన్ని చేసిన సినిమా రంగం మీదే నా దృష్టి ఉంది. దయచేసి అందరూ గమనించగలరు. సదా మీ చిరంజీవి అంటూ చిరు పేరుతో వచ్చిన ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ లేఖపై వెంటనే చిరు స్పందించారు. తన పేరుతో వచ్చిన ఆ లేఖ ఫేక్ అని చిరు తేల్చేశారు. అంతే కాదు మరోసారి మూడు రాజధానులకు మద్దతుగా చేసిన ప్రకటనకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అయితే చిరు ప్రకటనపై బీజేపీ, టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిరంజీవిపై విరుచుకుపడ్డారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి పదవి పొంది విభజన పాపంలో భాగమయ్యారని తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ఏపీకి రాజధాని విషయంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రజల తరఫున పోరాడుతుంటే సమర్థించాల్సింది పోయి చిరంజీవి కొత్త రాగం అందుకున్నారంటూ ఎద్దేవా చేశారు. అయినా తెలంగాణ వ్యాపారాలు, సినిమాలు చేసుకునే పెద్దన్నకు ఏపీ జనం కష్టాలు ఏం తెలుస్తాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా బీజేపీ నేతలు మాత్రం విశాఖలో భవిష్యత్తు ప్రయోజనాల కోసమే చిరు సీఎం జగన్‌కు మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. కాగా ఈ విమర్శలపై చిరు స్పందించలేదు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్‌పై తనకు నమ్మకం ఉందంటూ మరోసారి చిరంజీవి పునరుద్ఘాటించారు. దీంతో తన పేరుతో సోషల్ మీడియాలో వచ్చిన లేఖ ఫేక్..అని మూడు రాజధానుల విషయంలో తన మద్దతు సీఎం జగన్‌కే అని మరోసారి మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా మూడు రాజధానుల విషయంలో మెగా బ్రదర్స్ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో మెగా అభిమానులు, జనసేన శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. మరోవైపు మూడు రాజధానులకు చిరు మద్దతు పలకడంపై వైసీపీ శ్రేణులు ఆయన్ని అభినందిస్తున్నాయి.
