ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా పరిటాల సునీత, భూమా అఖిల ప్రియ వంటి టీడీపీ నేతలు అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని వితండవాదం చేస్తున్నారు. తాజాగా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి కూడా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేసీ పవన్ రెడ్డి మాట్లాడుతూ..ఏపీకి మూడు రాజధానుల ఆలోచనను తాము ఒప్పుకోమని అన్నాడు. పార్టీ నిర్ణయమైనా, వ్యక్తిగత నిర్ణయమైనా ఇదేనని స్పష్టం చేశాడు. విజయవాడ చాలా అందమైన నగరమంటూ జేసీ పవన్ రెడ్డి తెగ పొగిడేశాడు. అసలు విశాఖలో పరిపాలనా రాజధానికి, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇవ్వదని జేసీ పవన్ చెప్పుకొచ్చాడు. అయితే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటును వ్యతిరేకిస్తే ఆ ప్రాంతాల్లో టీడీపీ నష్టపోతోంది కదా అన్న ప్రశ్నకు మూడు రాజధానులను ఏర్పాటు చేస్తే వైసీపీ కూడా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నష్టపోతుందంటూ వాదించాడు. అమరావతి ఒక కులానికి చెందిన రాజధాని అన్న వాదనను అంగీకరించను అన్న జేసీ నిపుణుల కమిటీ నివేదిక వల్లే రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేశారని తెలిపాడు. అయితే జేసీ పవన్ వ్యాఖ్యలపై సీమ ప్రజలు మండిపడుతున్నారు. కర్నూలులో రాజధాని లేదా హైకోర్ట్ ఏర్పాటు చేయాలని సీమ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అన్నది సీమ ప్రజలకు సెంటిమెంట్‌గా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కర్నూలును హైకోర్ట్‌ను ఏర్పాటు చేస్తూ …జ్యుడిషియల్ క్యాపిటల్‌గా డెవలప్ చేసేందుకు ముందుకువస్తుంటే..జేసీ పవన్ కుమార్ రెడ్డి కేవలం చంద్రబాబు మెప్పు కోసం కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇవ్వదంటూ శాపనార్థాలు పెడుతున్నారని సీమ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానులపై అమరావతి పాట పాడుతున్న జేసీ పవన్‌కుమార్ రెడ్డిని సీమ ప్రజలు ఛీ కొడుతున్నారు. చంద్రబాబు పాదాల దగ్గర సీమ ప్రజల ఆత్మగౌరవాన్ని జేసీ పవన్ కుమార్ రెడ్డి తాకట్టు పెడుతున్నాడని మండిపడుతున్నారు. మొత్తంగా మూడు రాజధానులపై జేసీ పవన్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై రాయలసీమ భగ్గుమంటోంది.
