సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రెండు రిజర్వాయర్లకు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నామకరణం చేశారని మంత్రి హరీశ్ తెలిపారు. మల్లన్నను దర్శించుకుని ఆ తరువాత కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకోవడం భక్తుల ఆనవాయితీ అన్నారు. మల్లన్న దేవుడు, కొండపోచమ్మ అమ్మవారు భక్తులను ఎలా చల్లగ చూస్తున్నారో, రేపు మల్లన్నసాగర్ కొండపోచమ్మసాగర్ వచ్చే నీళ్లు రైతులను చల్లగా చూస్తాయన్నారు.
గోదావరి జలాలు కాళేశ్వరం విగ్రహాన్ని అభిషేకం చేసుకుని మల్లన్న పాదాలు తాకి మల్లన్నసాగర్ వెళ్లి అక్కడి నుండి కొండపోచమ్మ రిజర్వాయర్ వెళుతాయన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లకు గోదావరి నీళ్లను వచ్చే కల్యాణానికి తీసుకు వచ్చే విధంగా మల్లన్న దేవుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక కొమురవెల్లి మల్లన్న క్షేత్రమని మంత్రి హరీశ్ అన్నారు.కొమురవెల్లి అంటే గుర్తుకు వచ్చేది పట్నం, బోనం అని చెప్పారు. రంగుల రంగుల పట్నంవేసి మధ్యలో నిమ్మకాయ పెట్టి జంగు కొట్టి పిలిస్తే వచ్చే దేవుడు మల్లన్న అని తెలిపారు.
పట్నం వేసి బోనం పెడితే వర్షాలు బాగా కురుస్తాయని తెలంగాణ ప్రజల నమ్మకమన్నారు. సీఎం కేసీఆర్ ప్రయత్నం వల్లనే మల్లన్న దేవాలయం అభివృద్ది జరుగుతున్నదని.. గత రెండు, మూడేండ్లలో రూ.30 కోట్ల అభివృద్ది పనులు చేశామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మల్లన్న ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధ్ది చేస్తామని తెలిపారు. పుట్టమట్టితో ఏర్పడి, 500 ఏండ్ల చరిత్ర ఉన్నకొమురవెల్లి మల్లన్న విగ్రహం ఈ ఆలయంలో ఉండటం విశేషమని చెప్పారు. కొమురవెల్లి మల్లన్న జాతరంటే అసలు సిసలైన తెలంగాణ జాతర అని, ఆయన ఆశీస్సులతోనే ఈ ప్రాంతం సస్యశ్యామలమైందని మంత్రి హరీశ్ చెప్పారు.
Post Views: 348