టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, ఐఎయస్, ఐపీయస్ అధికారుల దగ్గర నుంచి సామాన్యుల వరకు పాల్గొంటున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రులు ప్రకాష్ జయదేకర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, పివిసింధూ, సానియామీర్జా వంటి సెలబ్రిటీలతో పాటు పలువురు సినీ తారలు ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు. తాజాగా టీమిండియా వుమెన్ క్రికెటర్ మిథాలీరాజ్.. ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియాలో భాగమయ్యారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను ఈ లెజెండరీ వుమెన్ క్రికెటర్ స్వీకరించి, నగరంలోని తిరుమలగిరిలో గల తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మిథాలీ మాట్లాడుతూ.. పర్యావరణహితం కోసం తన వంతు కృషి చేసే అవకాశం ఇచ్చిన డీసీపీ గారికి కృతజ్ఞతలు. ఈ మహా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. రాష్ట్రమంతా పచ్చదనంతో కళకళలాడాలని మిథాలి రాజ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మిథాలీరాజ్.. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, ప్రముఖ క్రీడాపాత్రికేయుడు బొరియా మజుందార్, పారిశ్రామిక వేత్త వాణి కోలాతో పాటు.. నటి కాజల్ అగర్వాల్‌కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. మిథాలీ ఛాలెంజ్‌కు నటి కాజల్ వెంటనే స్పందించి.. త్వరలోనే మొక్కలు నాటుతానని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ, కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం హరిత ఉద్యమంలా సాగడం విశేషం.
