మోదీ సర్కార్ తీసుకువచ్చిన ఎన్ఆర్సీ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ముస్లింలు, దళితులు, మైనారిటీ వర్గాలు ఎన్ఆర్సీ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాగా దేశవ్యాప్తంగా వివాదానికి కేంద్రబిందువైన జాతీయ పౌరపట్టిక (ఎన్ఆర్సీ) అమలుపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ఎన్ఆర్సీకి వ్యతిరేకమని, రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని సీఎం జగన్ ప్రకటించారు. మైనార్టీలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో భాగంగా సోమవారం కడప జిల్లాలో పర్యటించిన సందర్భంగా సీఎం జగన్ ఎన్ఆర్సీ బిల్లుపై స్పందించారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రభుత్వం తరుఫునే ఎన్ఆర్సీసీపై గతంలోనే వ్యాఖ్యలు చేశారని, ఆయన ప్రకటనకు కట్టుబడి ఉంటామని సీఎం జగన్ స్పష్టం చేశారు. కాగా వివాదాస్పద ఎన్ఆర్సీపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మైనార్టీల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముస్లిం, మైనార్టీలకు తాము అండగా ఉంటామని, ఏమాత్రం ఆందోళనకు గురికాద్దని డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా భరోసా ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పార్లమెంట్లో ఓటు వేసింది. తాజాగా సీఎం జగన్ కూడా ఎన్ఆర్సీకి వ్యతిరేకమని స్పష్టం చేశారు. మొత్తంగా ఎన్ఆర్సీపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ వైఖరిని స్పష్టం చేశాయి.
