ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనను చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి, జ్యుడిషియల్ క్యాపిటల్‌గా డెవలప్ చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను కర్నూలు జిల్లా టీడీపీ నేతలు తప్పు పడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. ఓ ఎల్లోమీడియా ఛానల్‌తో మాట్లాడుతూ..జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేసింది. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికే ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందని ఆరోపించారు. హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తూనే.. హైకోర్టు వచ్చినంత మాత్రానా సీమకు, నీళ్లు, పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయా అని అఖిల ప్రియ ప్రశ్నిస్తోంది. హైకోర్టు ఇచ్చి రాయలసీమను ఏదో ఉద్దరించామని ప్రభుత్వం చెప్పడం సరికాదని అఖిల ప్రియ ధ్వజమెత్తింది. చంద్రబాబు అందరికి అందుబాటులో ఉండే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని, అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంపై చంద్రబాబు ముద్రను చెరిపేయాలని చూస్తుందని ఆమె ఆరోపించారు. జగన్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోంది.అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ అఖిల ప్రియ డిమాండ్ చేసింది. అఖిల ప్రియ వ్యాఖ్యలపై కర్నూలు జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. గత కొద్ది నెలలుగా కర్నూలులో హైకోర్టు కోసం జిల్లా ప్రజలు ధర్నాలు, ఆందోళనలు చేస్తుంటే పట్టించుకోని అఖిల ప్రియ ఇప్పుడు ప్రభుత్వం కర్నూలు ప్రజల చిరకాల కోరికను నెరవేరుస్తుంటే ఓర్వలేక గుడ్డిగా విమర్శిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీమలో పుట్టి అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న అఖిలప్రియ సీమ ద్రోహి అని కర్నూలు ప్రజలు అంటున్నారు. కర్నూలులో హైకోర్టు వస్తే క్రమంగా రాజధాని స్థాయిలో డెవలప్ అవుతుందని ..కేవలం స్వార్థ రాజకీయాల కోసం పుట్టిన గడ్డను మరిచి అమరావతికి అనుకూలంగా మాట్లాడడం ఏం బాలేదని..అసలు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కావడం అఖిల ప్రియకు ఇష్టం లేదా అని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ఆలోచనపై అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యల పట్ల రాయలసీమలో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
