ఒకే ఇంటిలో ఉంటున్న అన్నదమ్ములు పార్టీలు మారితే ఎంత ఇబ్బందికరమో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి తెలిసివస్తోంది. తన కొడుకు కోసం తనను రాజకీయంగా తొక్కేస్తున్నాడనే భావనతో అయ్యన్న సోదరుడు, నర్సీపట్నం మాజీ మున్సిపల్ ఛైర్మన్ సన్యాసినాయుడు ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12 న సన్యాసిపాత్రుడు, ఆయన తనయుడు వరుణ్… తాము ఉంటున్న పోర్షన్‌పై వైసీపీ జెండా కట్టేందుకు యత్నించడంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో నర్సీపట్నంలో తీవ్ర ఉద్రికత్త ఏర్పడింది. ఇరువర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శాంతిభద్రతలకు భంగం కలుగకుండా అయన్నపాత్రుడి నివాసం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన అయ్యన్నపాత్రుడు వారిని అసభ్యకరంగా దూషించారు. ఈ మేరకు ఈ నెల 20 న అయ్యన్నపై కేసు నమోదు చేసినట్లు నర్సీనపట్నం సీఐ స్వామినాయుడు తెలిపారు. ఒకే ఇంట్లో ఒకే పార్టీలో ఇన్నాళ్లు కలిసిమెలిసి ఉన్న తన తమ్ముడు సన్యాసినాయుడు వైసీపీలో చేరడాన్ని అయ్యన్నపాత్రుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే సన్యాసినాయుడు తన పోర్షన్‌పై వైసీపీ జెండా కడుతుంటే..అయ్యన్న కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. మొత్తంగా అన్న దమ్ముల మధ్య నెలకొన్న విబేధాలు మున్ముందు మరెన్ని వివాదాలకు దారి తీస్తాయో చూడాలి.
