జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యవహార శైలి అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు తలనొప్పిగా మారింది. ఒకపక్క పవన్ కల్యాణ్ సీఎం జగన్‌పై విమర్శల మీద విమర్శలు చేస్తూ ఏకంగా యుద్ధమే చేస్తున్నాడు. మరోవైపు రాపాక మాత్రం ఛాన్స్ దొరికితే చాలు సీఎం జగన్‌పై ప్రశంసలు కురుస్తూ పాలాభిషేకాలు చేస్తున్నారు. గతంలో నిండు అసెంబ్లీలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై రాపాక మాట్లాడుతూ ఏకంగా సీఎం జగన్‌ను దేవుడిగా కొలిచారు. ఇటీవల ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించిన తరుణంలో రాపాక వైసీపీ మంత్రి విశ్వరూప్‌తో కలిసి ఏకంగా జగన్ ఫోటోకు పాలాభిషేకం నిర్వహించారు. ఇక ఇంగ్లీష్ మీడియంపై పవన్ ప్రభుత్వాన్ని తప్పుపడుతుంటే రాపాక మాత్రం సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. అంతే కాదు అధ్యక్షుడు పవన్‌కు, నాకు విబేధాలు ఉన్నాయని రాపాక మీడియాకు చెప్పుకొచ్చాడు. పవన్ కాకినాడలో నిర్వహించిన రైతు సౌభాగ్య దీక్షకు కూడా హాజరు కాలేదు..తాజాగా సీఎం జగన్ బర్త్‌డే సందర్భంగా మరోసారి పాలాభిషేకం చేసి రాపాక సంచలనం రేపారు. డిసెంబర్ 21న తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరీ గ్రామంలో చేనేత వేడుకల్లో జనసేన ఎమ్మెల్యే రాపాక పాల్గొన్నారు. అదే రోజు సీఎం జగన్ బర్త్ డే కావడంతో ఆయన ఫొటోకు రాపాక స్వయంగా పాలతో అభిషేకం చేయడం చర్చనీయాంశమైంది. అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బద్ధ శత్రువుగా భావిస్తున్న జగన్‌ను రాపాక కీర్తించడం పార్టీ శ్రేణులకు మింగుడుపడడంలేదు. తాజాగా సీఎం జగన్ ఫోటోకు మరోసారి పాలాభిషేకం చేసి పవన్ కల్యాణ్‌ను ఘోరంగా అవమానించాడని జనసేన శ్రేణులు రాపాకపై మండిపడుతున్నాయి. అయితే రాపాకకు ఆ మధ‌్య షోకాజ్ నోటీస్ జారీ చేసిన పార్టీ అధిష్టానం ఆ తర్వాత కామ్ అయిపోయింది. రాపాకను తొందరపడి సస్పెండ్ చేస్తే..ఆయన అసెంబ్లీలో వల్లభనేని తరహాలో స్వతంత్ర్య ఎమ్మెల్యేగా గుర్తింపు పొందుతాడని..ఆ మాత్రం దానికి ఉన్న ఒక్క ఎమ్మెల్యేను వదులుకోవడం ఎందుకని జనసేన అధిష్టానం భావిస్తోంది. మొత్తంగా రాపాక వ్యవహార శైలి..పవన్ కల్యాణ్‌కు ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి.
