ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. మూడు రాజధానుల ప్రకటనను టీడీపీ, జనసేన పూర్తిగా వ్యతిరేకిస్తుండగా కమలనాథులు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. కొందరు నేతలు మూడు రాజధానులకు అనుకూలంగా, మరి కొందరు నేతలు వ్యతిరేకంగా మారుతున్నారు. ఇక తాజాగా ఎర్రన్నలు రంగంలోకి దిగారు. సీపీఐ నారాయణ మూడు రాజధానుల ఏర్పాటుపై మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు వైఫల్యం వల్లే రాజధాని నిర్మాణం మూడు ముక్కలాటగా మారిందని నారాయణ విమర్శించారు. చంద్రబాబు రాజధాని నిర్మాణంలో విఫలమయ్యారని, అవసరమైన దానికంటే… ఎక్కువ భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూశారని ఫైర్ అయ్యారు. . కాగా ఏపీ రాజధాని గుంటూరు, విజయవాడ మధ్యలో ఉండాలని సీపీఐ పార్టీ కోరుకుందని, మద్రాస్ రాష్ట్రం విడీపోయినప్పుడు కూడ ఇదే విధానాన్ని స్పష్టం చేశామని చెప్పారు. ఇప్పుడు కూడ అదే నిర్ణయంతో ఉన్నామని నారాయణ స్పష్టం చేశారు.
అయితే రాష్ట్ర ఏర్పాటు తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేసినా… దాన్ని అమలు చేయడంలో వైఫల్యం చెందారని విమర్శించారు. ముఖ్యంగా రాజధాని నిర్మాణం కోసం రెండు లేదా మూడు వేల ఎకరాలు తీసుకుని పరిపాలనకు సంబంధించిన భవనాలు కట్టి ఉండాల్సిందని నారాయణ అభిప్రాయపడ్డారు. కాని చంద్రబాబు మాత్రం ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూశారని, అందుకే కేంద్రం కూడ సహకరించలేదని నారాయణ మండిపడ్డారు. చంద్రబాబు అనుసరించిన విధానాలతోనే రాజధాని నిర్మాణం ఆలస్యం అయిందని వివరించారు. ప్రభుత్వం మారడంతో చంద్రబాబు చేపట్టిన రాజధాని నిర్మాణం కొనసాగించడం వల్ల జగన్‌కు వచ్చే ప్రయోజనం లేకపోవడంతో జగన్ అధికార వికేంద్రీకరణ పేరుతో రాజధానిని తరలిస్తున్నారని నారాయణ స్పష్టం చేశారు. అయితే ఎర్రపార్టీల అధినేతలు బాబుగారి సామాజికవర్గానికి చెందినవారు కావడంతో పైకి వ్యతిరేకించినా..లోలోపల మాత్రం లోపాయికారిగా టీడీపీకి వత్తాసు పలుకుతుంటారు. తాజాగా మూడు రాజధానుల విషయంలో కూడా చంద్రబాబును విమర్శిస్తూనే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. తమ సామాజికవర్గం ఆధిపత్యం ఎక్కడ పోతుందనే భయంతోనే అధికార, పరిపాలనా వికేంద్రీకరణను గుడ్డిగా ఎర్ర పార్టీలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయనే చెప్పాలి. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడం వల్ల వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం డెవలప్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. అయినా ఎర్ర పార్టీల నేతలు అమరావతికే వత్తాసు పలుకుతున్నారంటే..వారికి అట్టడుగు వర్గాల కంటే వారి సామాజికవర్గ ప్రయోజనాల ముఖ్యమని నారాయణ మాటల ద్వారా అర్థమవుతుంది. మొత్తంగా మూడు రాజధానుల విషయంలో సీపీఐ పార్టీ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది.