ధర్మవరంలో నేతన్నల అగచాట్లు గురించి తన కన్నా ఎక్కువ ఇంకా ఎవరికీ తెలియకపోవచ్చని, ధర్మవరం పక్కనే పులివెందుల నియోజకవర్గం ఉందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ధర్మవరంలో ఎప్పుడు నేతన్నలకు ఏ కష్టం వచ్చినా, వచ్చి అండగా నిలబడింది, ధర్నాలు చేసింది తాను మాత్రమే అని ఆయన గుర్తు చేశారు. అగ్గిపెట్టెలో పట్టే చీర తయారు చేసింది ధర్మవరం నేతన్నలు అన్న సీఎం, ఇక్కడి చేనేత వృత్తి దేశంలోనే ఒక గర్వకారణంగా నిలుస్తోందని చెప్పారు.
ఇక్కడి వస్త్రాలు, ఇక్కడి నేతన్నల నైపుణ్యం గురించి ప్రపంచమంతా కూడా చెప్పుకుంటారని, కానీ వారి బాధలు మాత్రం ఎవరూ పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సబ్సిడీ రాక నేతన్నలు ఇబ్బంది పడుతుంటే ధర్నా చేశానని, ఆత్మహత్య చేసుకుంటున్న చేనేతకారుల కుటుంబాలను ఎవరూ పట్టించుకోకపోతే గళం విప్పి అడిగానని, అయినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేశారు.
3648 కి.మీ సుదీర్ఘ పాదయాత్రలో చేనేతకారుల కష్టాలు స్వయంగా చూశానని, చాలా చోట్ల వారి అగచాట్లు, బాధలు విన్నానని, చేనేతకారులు పేదరికంలో ఉండడం, అప్పుల్లో కూరుకుపోవడం వారి నిత్య జీవితమైందని సీఎం పేర్కొన్నారు.