ఒకరికి తెలియకుండా మరొకరిని వరుసగా ఆరు పెళ్లిళ్లు చేసుకుని వంచనకు పాల్పడిన నిత్య పెళ్లికూతురు కేసులో ఆమె తండ్రికి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా మోదినీపురం గ్రామానికి చెందిన అనంతరెడ్డి కుమార్తె మౌనికకు ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తితో 2018 మే లో వివాహమైంది. అమ్మాయి బాగుండడంతో ఆమెకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. కొద్ది నెలల పాటు వీరు సఖ్యతగా ఉన్నారు. ఆ తర్వాత ఆగస్టు 25న అనంతరెడ్డి వచ్చి తమ కూతురిని పుట్టింటికి తీసుకెళతానని చెప్పి పిలుచుకుని వెళ్లాడు. అప్పటి నుంచి ఇద్దరూ కనిపించలేదు.
దీంతో అనుమానం వచ్చిన భర్త రామకృష్ణారెడ్డి ఆగస్టు 29న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె వాడుతున్న సెల్ నంబర్ ఆధారంగా పోలీసులు హైదరాబాద్‌లో ఆమెతో పాటు చంటినాయక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. కొమ్మలూరుకు చెందిన వ్యక్తికి వివాహం చేసుకునే ముందు ఆమెకు నలుగురితో వివాహమైందని, ఇతన్ని వివాహం చేసుకుని పారిపోయిన తర్వాత హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని ఆరో వివాహం చేసుకున్నట్లు తెలిసింది. మైదుకూరు కోర్టులో ఏడాది పాటు కేసు విచారణ జరిగింది. కిలాడీ లేడి తండ్రి అనంతరెడ్డిని దోషిగా గుర్తించిన కోర్టు ముద్దాయికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది. మౌనికతో పాటు చంటినాయక్ కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. వారు దొరికితే వారు చేసిన నేరంపై కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.