ఏపీ సీఎం జగన్ దక్షిణాఫ్రికా మోడల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అమరావతిలో అసెంబ్లీ, వైజాగ్‌లో సెక్రటేరియట్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తూ మూడు రాజధానులుగా డెవలప్ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. మూడు రాజధానుల ప్రకటనపై లోకసత్తా అధినేత జయప్రకాష్ నారాయణ, టీడీపీ ఎమ్మెల్యే గంటా, బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి, టీడీపీ నేత, మాజీమంత్రి కొండ్రు మురళీ తదితరులు స్వాగతించగా, చంద్రబాబు, టీడీపీ నేతలతో సహా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు అమరావతిలో తమ సామాజికవర్గానికి చెందిన రైతులను రెచ్చగొడుతూ ప్రాంతీయ విబేధాలు రగలించడానికి కుట్ర చేస్తున్నాడు. అయితే తాజాగా మూడు రాజధానుల ఏర్పాటుపై మాజీ మంత్రి, రాయలసీమ ఉద్యమ నేత మైసూరా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నానని, ఒకవేళ ఎవరైనా కాదు, కూడదంటే మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేయాల్సిందేనని మైసూరారెడ్డి తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా పన్నులు కట్టగా వచ్చే ఆదాయంతో కేవలం అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. రాజధాని రైతులకు భూములిచ్చిన కొందరు రైతులు చేస్తున్న ఆందోళనపై మైసూరా రెడ్డి మాట్లాడుతూ…రాజధానికి భూమిలిచ్చాం కాబట్టి క్యాపిటల్, సచివాలయం, ఇతర కార్యాలయాలు, సంస్థలన్నీ తమ వద్దే ఉండాలని కోరడం సబబు కాదని, రాజధానికి ఉత్త పుణ్యానికే భూములు ఇవ్వలేదని మండిపడ్డారు. ఎవరైనా భూములిస్తే డెవలప్ చేసి ఇవ్వడం సహజంగా జరిగే ప్రక్రియ అని ఆయన కొట్టిపడేశారు. అయితే అమరావతిలో రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల భూములు లాక్కోవడం చంద్రబాబు చేసిన తప్పు అని ఫైర్ అయ్యారు. రాజధాని రైతులు భూములిచ్చి త్యాగం చేశారని, కాబట్టి ప్రతిదీ తమకే కావాలని కోరుకోవడం స్వార్థపూరిత ఆలోచన అని మైసూరా అన్నారు. భూమిలిచ్చారు కాబట్టి రాజధాని, సచివాలయం, హైకోర్టు, ఇతర కార్యాలయాలు తమ వద్దే ఉంచుకోవాలనుకుంటే ఎవరూ అభ్యంతరం చెప్పరని, అయితే మా సీమవాసులకు అలాంటి భావనలే ఉన్నాయి కాబట్టి.. మూడు రాజధానులు వద్దనుకంటే.. మాకు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం తమ ప్రాంతంలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాయలసీమ నిర్లక్ష్యానికి గురవుతుందన్న భావోద్వేగాలు సీమ వాసుల్లో బలంగా ఉన్నాయన్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుకుని గ్రేటర్ రాయలసీమ రాష్ట్రంగా ఏర్పడితే… దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగారా అభివృద్ధి చెందే అవకాశం ఉందని మైసూరా చెప్పారు.రాజధాని అమరావతి లేకపోతేనో, వాళ్లతో కలిసి ఉంటే తప్ప బతకలేని దుస్థితిలో రాయలసీమ వాసులు లేరని ఆయన ధ్వజమెత్తారు. కేవలం తమ సామాజికవర్గం కోసమే చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించాడని కాని… కనీసం మాట మాత్రమైనా ఎవరితోనూ చర్చించలేదని మైసూరా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రాయలసీమవాసులే కాకుండా ఉత్తరకోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు కూడా తమ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదనే అసంతృప్తితో ఉన్నారని మైసూరా ఆవేదన వ్యక్తం చేశారు. కావున అన్నీ తమ ప్రాంతంలోనే ఉండాలనే డిమాండ్‌తో మున్ముందు మూడు రాష్ట్రాల విభజనకు దారితీసే పరిస్థితులను తీసుకురావద్దని మైసూరా అమరావతిపై ఆందోళన చేస్తున్న చంద్రబాబుకు, టీడీపీ నేతలకు హితవు పలికారు. మొత్తంగా మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతించిన జగన్..ఒకవేళ మూడు రాజధానులు వద్దనుకుంటే మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేయాల్సిందే అంటూ కుండబద్ధలు కొట్టారు. మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు, ఎల్లోమీడియా చేస్తున్న కుట్రలకు మైసూరా వ్యాఖ్యలు చంద్రబాబుకు చెంపపెట్టు అనే చెప్పాలి.
