ఆంద్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం రోజురోజుకు వివాదాస్పదమవుతుంది. అమరావతి లో రైతులు రాజధానిని తరలించవద్దంటు ధర్నాలు చేస్తుంటే, వారికి ప్రతిపక్ష నాయకులు మద్దతిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేక మాట్లాడిన నాయకులకు అధికార వైసీపి పార్టీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తు్న్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల జగన్ పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే, పవన్ వాఖ్యలను వైసీపి ఎమ్మేల్యే రోజా తీవ్రంగా ఖండించారు. పవన్ ఎప్పుడు చంద్రబాబు మనిషేనని ఆమె విమర్శించారు. చంద్రబాబుకు నచ్చినట్టే పవన్ కళ్యాణ్ మాటలు మారుస్తారని రోజా ఎద్దేవా చేశారు. అసలు రాజధాని నిర్మాణానికి ఎన్ని ఎకరాలు కావాలో జనసేన అధినేత తెలుసుకోవాలని ఆమె చురకలంటించారు. తమ ఆస్తులను కాపాడుకోవడానికే చంద్రబాబు,ఆయన అనుచరులు ప్రయత్నిస్తున్నారని, రాజధాని విషయంలో అవగాహన లేకుండా టీడిపి ప్రభుత్వం హడావిడి నిర్ణయం తీసుకుందని రోజా ఆరోపించారు. కర్నూలు రాజధాని విషయంలో పవన్ మాటమార్చారన్న రోజా, మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని తెలిపారు. ఇలా రాజధానుల విషయంలో ఎవరేం మాట్లాడిన అధికార పార్టీ నేతలు ఒక్కొక్కరుగా కౌంటర్లు ఇస్తున్నారు.
