ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలకు స్వయానా సోదరుడైన మెగాస్టార్ చిరంజీవి కౌంటర్ ఇచ్చారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు చిరు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అధికార, పరిపాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన స్నష్టం చేశారు. అమరావతి శాసన నిర్వాహక, విశాఖ కార్యనిర్వాహక, కర్నూలు న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరు స్వాగతించాలని చిరంజీవి పిలుపునిచ్చారు. ఈ మేరకు మీడియాకు ఓ లేఖను చిరు విడుదల చేశారు. ఏపీలో వివిధ ప్రాంతాల అభివృద్ధికై నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులు సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించేవిగా ఉన్నాయని చిరంజీవి అభిప్రాయపడ్డారు. . గతంలో అభివృద్ధి, పాలన అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైందని అందువల్లే ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యం కాబడి, ఆర్థిక, సామాజిక సమతుల్యాలు దెబ్బతిన్నాయని చిరు ఉన్నారు. ఇప్పటికే మూడు లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో లక్షకోట్ల అప్పుతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏంటన్న ఆందోళన అందరిలోనూ ఉందని చిరు తెలిపారు. సాగు, తాగు నీరు, ఉపాధి అవకాశాలు లేక ఊర్లు విడిచిపోతున్న వలస కూలీల బిడ్డల భవిష్యత్‌కు, నిరుద్యోగులకు మూడు రాజధానుల ప్రతిపాదన భద్రతనిస్తుందని చిరు స్పష్టం చేశారు.
అయితే ఇదే సమయంలో అమరావతిలో నెలకొన్న ఆందోళనపై కూడా చిరు స్పందించారు. రాజధాని రైతులలో నెలకొన్న భయాందోళనలు, అభద్రతా భావాన్ని తొలగించాలని చిరు ప్రభుత్వాన్ని కోరారు. అమరావతి ప్రాంత రైతులు నష్టపోకుండా, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. మూడు రాజధానులపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అపోహలు, అపార్థాలు తొలగించే దిశగా ప్రభుత్వం ప్రయత్నించాలన్నారు. ప్రజల ఆకాంక్షలు, సవాళ్లపై నిపుణుల కమిటీ విస్తృతంగా పరిశీలన చేసినట్లు భావిస్తున్నామని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి రాజధాని సహా అన‍్ని రంగాల్లో అభివృద్ధి కోసం నిపుణుల కమిటీ సూచించిన వ్యూహాన్ని సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తారని, రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుందని చిరంజీవి ఆకాంక్షించారు. కాగా మూడు రాజధానులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారా..అమరావతికి భూములిచ్చిన రైతుల అన్యాయం చేస్తారా అంటూ చిరు సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి మూడు రాజధానుల నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించడంతో పవన్ కల్యాణ్‌కు మైండ్ బ్లాక్ అయిందనే చెప్పాలి. మొత్తంగా మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్‌కు చిరు మద్దతు పలకడంతో పవన్‌తో సహా జనసేన పార్టీ శ్రేణులకు తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది.