తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మూడంటే మూడేండ్లల్లోనే పూర్తి చేసిన అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. అప్పటి నీళ్ల మరియు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర పర్యవేక్షణలో కాళేశ్వరం నిర్మాణాన్ని పరుగులు పెట్టించి మరి మూడేండ్లల్లోనే పూర్తి చేసింది ప్రభుత్వం.
తాజాగా ఎత్తిపోతల పథకంలో మరో కీలకమైన ఘట్టానికి కేంద్ర బిందువుగా మారింది కాళేశ్వరం. యావత్తు ఆసియా ఖండంలోనే అతిపెద్ద సర్జ్ పూల్ (మహాబావి)ఉన్న అన్నపూర్ణ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. శ్రీరాజరాజేశ్వర జలాశయం (మిడ్ మానేరు)నుంచి మల్లన్నసాగర్ వరకు నీటిని ఎత్త్తిపోయడంతో ఈ రిజర్వాయరే అత్యంత కీలకం. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ రిజర్వాయర్ నుంచి తొంబై రోజుల్లో 88.24టీఎంసీల నీటిని ఎత్తిపోయచ్చు.
అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక్ సాగర్ ,మల్లన్నసాగర్ కు గోదావరి జలాలను తరలించనున్నారు. దీనిని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్ద నిర్మించారు. దీని సామర్థ్యం 3.5టీఎంసీలు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకెజీ 10లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ రిజర్వాయర్ శ్రీరాజరాజేశ్వర జలాశయానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.