ఏపీలో మూడు రాజధానుల ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న వేళ..జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. అధికార వికేంద్రీకరణ దిశగా 13 జిల్లాల ఏపీని 25 జిల్లాలుగా విభజించడానికి ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ విశాఖలో సీఎం జగన్ బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇక నుండి ఆంధ‌్రప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాలు కాదు 25 జిల్లాలు అంటూ ఆసక్తికర వ్యాఖ‌్యలు చేశారు. భవిష్యత్తులో ఏపీని 25 జిల్లాలుగా చేస్తామని చెప్పుకొచ్చిన ఆయన… దానికి తగ్గట్టుగానే అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందేందుకే.. సీఎం జగన్ మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. ముఖ్యంగా విశాఖ పట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేస్తూ సీఎం జగన్ చేసిన ప్రకటన చరిత్రలో నిలిపోతుందన్న విజయసాయిరెడ్డి… అధికారం కోసం ఆశపడకుండా ప్రజలకు సేవ చేయడానికి నిత్యం పరితపించే వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అంటూ కొనియాడారు. అధికార వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందుతాయని …అందుకోసం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను రాబోయే కాలంలో 25 జిల్లాలుగా చేస్తామని చెప్పారు. కాగా ఏపీలో అధికారంలోకి వస్తే, ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఇక తాజాగా మూడు రాజధానుల ప్రకటన కూడా 25 జిల్లాల ఏర్పాటు కోసమే అని చెప్పటం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఇప్పటికే మూడు రాజధానుల ప్రకటనపై రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబు ప్రజల్లో వస్తున్న సానుకూలత చూసి యూటర్న్ తీసుకుంటున్నాడు. టీడీపీ హయాంలోనే అధికార వికేంద్రీకరణ జరిగందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాడు.మరి 25 జిల్లాల ఏర్పాటు నిర్ణయంపై బాబు ఎలా స్పందిస్తాడో చూడాలి.మొత్తంగా 3 రాజధానులు, 25 జిల్లాలతో ఏపీ ముఖచిత్రం పూర్తిగా మారనుంది.
