కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై రాయలసీమ యువజన, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు, పవన్ దిష్టిబొమ్మలతో గురువారం కర్నూలులో శవయాత్ర నిర్వహించి కేసీ కెనాల్‌లో నిమజ్జనం చేశారు. జేఏసీ నాయకులు శ్రీరాములు, చంద్రప్ప, సునీల్‌కుమార్‌రెడ్డి, రామకృష్ణ మాట్లాడుతూ శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు ఈ విషయాన్ని పట్టించుకోలేదని, దీనికి పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు మూడు రాజధానుల ఆలోచన చేశారని, టీడీపీ, జనసేనలు దానిని వ్యతిరేకించడం దారుణమన్నారు. రాయలసీమ అభివృద్ధి టీడీపీ, జనసేనకు ఇష్టం లేనట్లుగా ఉందని వారు మండిపడ్డారు. రాయలసీమకు వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రకటనలు చేసినా ఆ పార్టీ నాయకులను బయట తిరగనీయబోమని హెచ్చరించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీల అభ్యర్థులను ఓడించేందుకు పనిచేస్తామన్నారు.