జోగుళాంబ గద్వాల జిల్లాలోని 5వ శక్తి పీఠమైన బాల బ్రహ్మేశ్వర స్వామి జోగుళాంబ అమ్మవారి ఆలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఉదయం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ కె. సరిత, అలంపూర్ ఎమ్మెల్యే ఆబ్రహంతో కలిసి బాలబ్రహ్మోశ్వర స్వామి ఆలయాన్ని, జోగుళాంబ ఆమ్మవారి అలయాన్ని దర్శించుకున్నారు.
అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయటంతో పాటు ఒక మంచి పర్యాటక కేంద్రంగా మారుస్తామని పేర్కొన్నారు. కేంద్ర అర్కియాలజీ శాఖ వారికి సంబంధం లేకుండా చేయగలిగిన అన్ని అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. త్వరలోనే తుంగభద్ర వంతెనను ప్రారంభించుకోవటం జరుగుతుందన్నారు.
నదికి అవతలివైపు రెస్టారెంట్, వసతి గృహము ఏర్పాటు చేయటంతో పాటు జోగుళాంబ అలయం నుండి శ్రీశైలం వరకు బోటులో ప్రయాణించే విధంగా బోటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాబోయే తుంగభద్ర పుష్కరాల పై ప్రత్యేక సమావేశము ఏర్పాటు చేసుకొని పుష్కరాలకు కావలసిన అన్ని ఏర్పాట్లపై తగు చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలియజేసారు.