తిరుపతిలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ, విశాఖపట్నంలో హైఎండ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్యకలాపాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలనే అంశం పై చర్చించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడంలో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు అవశరమని అన్నారు. దీనివల్ల ఏం జరుగుతోందన్నదానిపై ఒక అవగాహన ఉంటుందన్నారు. సమీక్షించడం, పర్యవేక్షించడం సులభతరం అవ్వడమే కాకుండా అవినీతికి ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లలో ఏ అంశాలపై శిక్షణ ఇవ్వాలన్నదానిపై ఈ యూనివర్సిటీ నిర్ణయిస్తుందని చెప్పారు. అప్పుడే ఏయే కేంద్రాల్లో ఏ తరహా శిక్షణ దొరుకుతుందన్న దానిపై విద్యార్థులకు పూర్తి స్థాయి అవగాహన ఉంటుందని, దీనివల్ల పటిష్టమైన ఒక వ్యవస్థ ఏర్పడుతుందని సీఎం పేర్కొన్నారు.
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను పాలిటెక్నిక్ కాలేజీల పరిదిలో నిర్వహించనున్నారు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక పాలిటెక్నిక్ కాలేజీ అవసరమైతే మరొకటి ఏర్పాటు చేసి, వాటిని నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చాలని సీఎం ఆదేశించారు. వీటన్నింటినీ యూనివర్సిటీ గైడ్ చేస్తుందన్నారు. ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ లాంటి కోర్సులు పూర్తి చేసిన వారిలో మరింతగా నైపుణ్యం పెంపొందించేందుకే వీటిని తీసుకు వస్తున్నామని చెప్పారు. వచ్చే సమావేశం నాటికి పార్లమెంట్‌కు ఒక పాలిటెక్నిక్ కాలేజీని గుర్తించి, ఆ కాలేజీలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేద్దామన్నారు. ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆ కాలేజీలో జరగాలని, శాశ్వతంగా నైపుణ్యాభివృద్ధికి ఇది కేంద్రం కావాలని సీఎం స్పష్టం చేశారు. మంచి కంపెనీల సహకారంతో మంచి పాఠ్య ప్రణాళికను రూపొందించాలని, మనం ఇచ్చే సర్టిఫికెట్ చూసి తప్పకుండా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఉండాలన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్దులు సద్వినియోగం చేసుకుంటారని తద్వారా రాష్టంలో నిరుద్యోగాన్ని నిర్మూలిచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెల్పారు.