ఏపీ వేగంగా అభివృద్ధి చెందాలి అంటే అది కేవలం వికేంద్రీకరణ ద్వారానే సాధ్యమవుతుందని వైఎస్సార్‌సీపీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని స్వాగతింతున్నట్లు తెలిపారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ఆలోచన చేశారన్నారు. హైదరాబాద్ మాదిరిగానే అమరావతిని కూడా అభివృద్ధి చేస్తానంటూ చంద్రబాబు ప్రజలను మోసం చేసారని విమర్శించారు. చంద్రబాబు 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నా రాయలసీమ ప్రాంతానికి చేసింది ఏమీలేదని గుర్తుచేశారు.
రాయలసీమలో కనీసం హైకోర్టును ఏర్పాటు చేయాలంటూ చంద్రబాబును ఎన్నో సార్లు కోరినా పట్టించుకోలేదన్నారు. రాయలసీమ ప్రజల ఆకాంక్షలను జగన్ నెరవేస్తున్నారని, సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు బాగా వెనుకబడి ఉన్నాయని, అన్నారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలకు రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు అనుకూలమో… వ్యతిరేకమో చెప్పాలని శిల్పా డిమాండ్ చేశారు. రాజధానిలో చంద్రబాబు, ఆయన మనుషులు కొన్న భూములకు రేట్లు తగ్గి పోతాయని భయపడి పోతున్నారని అసలు కారణం అదేనన్నారు. అభివృద్ధి ఎవరుచేసినా ప్రజలు స్వాగతిస్తారని, జగన్ పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ఏపీ లోని అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి పరచాలనుకుంటున్నారని శిల్పా రవిచంద్ర అన్నారు.