ఏపీ లో పరిపాలనా వికేంద్రీకరణ దిశగా జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి విశేష ఆదరణ లభిస్తోంది. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని జగన్ చేసిన ఈ ఆలోచన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందనడంలో సందేహంలేదు. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్.. కర్నూలులో హైకోర్టు, జ్యూడిషియల్ క్యాపిటల్.. విశాఖలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ పెట్టొచ్చని సీఎం జగన్ చెప్పారు. ఈ అంశంపై ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం స్థిరత్వం లేకుండా అస్తవ్యస్తంగా చేస్తోందని ధ్వజమెత్తారు. మూడు రాజధానుల ప్రకటనపై చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని ఇంకా ఎన్ని ఊళ్లు తిరగాలి.? చరిత్ర పొడవునా ఆంధ్రులకు ఇదే ఖర్మా.? మొదట మద్రాసు, తర్వాత కర్నూలు, తర్వాత హైదరాబాద్, తర్వాత అమరావతి. ఇప్పుడు మరోచోట. రాజధాని పేరుతో ఇంత అస్థిరత సృష్టిస్తే పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వస్తారా? ఈ ఏడు నెలల్లో ఎవరైనా వచ్చారా.? అని విమర్శించారు.
రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందని అభివృద్ధి కుంటుపడిందని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా అయ్యే అవకాశాలున్నాయంటూ శాసనసభలో సీఎం వైఎస్ జగన్ ప్రకటనను తాను స్వాగతిస్తున్నానని ప్రకటించారు. దీనిపై ఆయన ఒక ట్వీట్ చేశారు. అధికారిక వికేంద్రీకరణలో విశాఖ ను పరిపాలనా రాజధానిగా ఎంచుకోవడం సంతోషకరం అని అన్నారు.. సముద్ర తీర ప్రాంతమైన విశాఖను పరిపాలనా రాజధాని చేయడం సరైనదేనని గంటా అభిప్రాయపడ్డారు. రోడ్డు, రైలు, విమానయానం, జల రవాణాతో అనుసంధానమైన విశాఖ నగరం ఏపీ లో అభివృద్ధి చెందిన నగరంగా ఉన్నది. ఇది పరిపాలనా రాజధానిగా మారితే. హైదరాబాదు స్థాయిలో గుర్తింపు వస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజలందరి ఆశలు, ఆకాంక్షల్ని నెరవేర్చే నగరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయనన్నారు. మరి పార్టీ అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా గంటా చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన పార్టీ మారుతున్నారన దానికి సంకేతాలుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పార్టీనుంచి దూరమైన వల్లభనేని వంశీ చెంతన గంటా కూడా చేరబోతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.