పౌరసత్వ సవరణ బిల్లు చట్టంగా రూపుదిద్దుకున్న నేపథ్యంలో ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలలో నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి. ఈ తరుణంలో దేశంలో హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తపడాలని సూచనలు చేసింది. మతాల ముసుగులో విద్వేషాలు సృష్టించే మూకలు పలు సంఘ విద్రోహక చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నదని అప్రమత్తంగా ఉండాలని ముందు జాగ్రత్త చర్యలకు వెనుకాడవద్దని రాష్ట్రాలకు కేంద్ర హోమ్ శాఖ సూచించింది. హింసను ప్రేరేపించే విధంగా అసత్య వార్తలు ప్రచారం చేసేవారిపైనా, సోషల్ మీడియా పోస్టులు చేసే వారిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని, వివాదాస్పద ప్రాంతాలను ముందుగా గుర్తించి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవలసిందిగా కేంద్ర హోంశాఖ ఆజ్ఞలు జారీచేసింది.
