ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామా నాయుడు, రామకృష్ణ బాబు, అశోక్ ,రామ్మోహన్ , సాంబశివరావు, వీరాంజనేయ స్వామి, సత్య ప్రసాద్, మద్దాల గిరి ఉన్నారు. రాజధానిలో జరిగిన కుంభకోణాలను బయటపెడుతుంటే ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు గొడవ చేస్తున్నారని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి అన్నారు.
అంతకుముందు ముఖ్యమంత్రి జగన్ కల్పించుకుంటూ రాజదానికి సంబందించిన వాస్తవాలు బయటపెడుతుంటే కావాలని ప్రజలకు అవి వినపడకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారని, వారిని సస్పెండ్ చేసి అయనా సభ జరిపించాలని అన్నారు. కాగా అమరావతిపై క్లారిటీ ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.ప్రశాంతంగా కూర్చుంటే అన్ని విషయాలు చెబుతామని మంత్రి బొత్స అన్నారు. కాగా చంద్రబాబు నాయుడు అమరావతిలో స్కామ్ లు ఉంటే చర్య తీసుకోవచ్చని అన్నారు. అయితే బుగ్గన టీడీపీ నేతల పేర్లు బయటపెడుతున్న తరుణంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడం విశేషం.చంద్రబాబు తప్ప మిగిలిన తొమ్మిది మంది టిడిపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. టీడీపీఎమ్మెల్యేలు కావాలని పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్నారని స్పీకర్ సీతారామ్ వ్యాఖ్యానించారు. సస్పెన్షన్ చేయడం ఇష్టం లేకపోయినా, తరచుగా వీరు అదే పనిచేస్తున్నారని అన్నారు . రాజకీయ లబ్ది పొందడానికి వారు ప్రయత్నం చేశారని అన్నారు.