ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తిరుమలలో అన్యమతప్రచారంపై జరిగిన చర్చ సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల తిరుమలలోని శేషాచల కొండల్లో చర్చి ఉందంటూ, ఓ శిలువ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అది వాస్తవానికి అటవీ శాఖకు చెందిన వాచ్ టవర్..దాని మీద ఉన్న సోలార్, సీసీటీవీ పైపులను శిలువ ఆకారంలో వచ్చేలా మార్ఫింగ్ చేసి, దానిపై దుష్ప్రచారం చేసినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. తిరుమలలో చర్చి అంటూ జరిగిన ప్రచారంపై టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన పోలీసులు అరుణ్ కాటేపల్లితో పాటు కార్తిక్ గరికపాటి, మిక్కిలినేని సాయి అజిత్ చక్రవర్తి అనే ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. వీరిలో అరుణ్ కాటేపల్లి టీడీపీ సానుభూతిపరుడని, టీడీపీ సోషల్ మీడియా టీమ్ సహకారంతోనే తిరుమలపై అన్యమత ప్రచారం చేసినట్లు విచారణలో తేలింది. తాజాగా అసెంబ్లీలో తిరుమలలో అన్యమత ప్రచారంపై చర్చ జరిగిన సందర్భంగా మరోసారి ఈ అంశంపై టీడీపీ, వైసీపీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు చోటుచేసుకున్నాయి.తిరుమలలో అన్యమత ప్రచారంలో లోకేష్ హస్తం ఉందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని లోకేష్ స్కెచ్ వేశారని మంత్రి ఆరోపించారు. నిజంగా తిరుమల కొండపై శిలువ ఉందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, అదే శిలువ లేకపోతే లోకేష్ రాజీనామా చేస్తారా.. అని వెల్లంపల్లి అసెంబ్లీ వేదికగా సవాల్ చేశారు. మంత్రి సవాల్‌కు మండలిలోనే ఉన్న నారా లోకేష్ స్పందించాడు. తిరుమలలో అన్యమత ప్రచారం విషయంలో తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయకపోతే వెల్లంపల్లి రాజీనామా చేస్తారా అంటూ లోకేష్ ప్రతి సవాల్ విసిరారు. దీంతో…సభలో రెండు పార్టీల సభ్యుల నినాదాలతో హోరెత్తింది. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి టీడీపీ ఆరోపణల మీద స్పందించారు. టీటీడీ మీద మచ్చ వేయాలని టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. టీటీడీ కొండపై శిలువ అనేది టీడీపీ సోషల్ మీడియా టీమ్ క్రియేటివిటీ అని స్పష్టం చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టాలని టీడీపీ కుట్ర పన్నిందని.. టీటీడీలో అన్యమత ప్రచారం జరిగిందనేది అవాస్తవమని తేల్చిచెప్పారు. తిరుమల వెంకటేశ్వరస్వామితో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. ఇప్పటికే నాశనం అయ్యారని.. ఆలయాల జోలికి వస్తే ఇంకా నాశనం అవుతారని టీడీపీని ఉద్దేశించి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా తిరుమలలో అన్యమత ప్రచారం విషయంలో చర్చ సందర్భంగా అధికార వైసీపీ, టీడీపీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో సభ దద్దరిల్లింది.
