ఏపీ అసెంబ్లీలో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. టీడీపీలో మంచి వాగ్ధాటితో మాట్లాడే ఎమ్మెల్యేలలో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ముందు వరుసలో ఉంటారు. అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు మొదటి స్పీచ్‌లోనే అదరగొట్టిన భవానీ ఇవాళ మద్యపానంపై చర్చ సందర్భంగా వైన్‌షాపులతో ఎదురవుతున్న ఇబ్బందులు గురించి మాట్లాడారు. ఇళ్లమధ్యలో, దేవాలయాల వద్ద, స్కూల్స్ వద్ద వైన్స్ షాపులు ఉండడం వల్ల ప్రజలకు ముఖ్యంగా మహిళలకు, విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని సభకు వివరించారు. ఎన్నికలకు ముందు సంపూర్ణ మధ్యనిషేధం అని చెప్పిన జగన్…ఇప్పుడు దశలవారీగా నిషేధం అంటున్నారు..ఇది మాట తప్పడం కాదా అధ్యక్షా…అంటూ భవానీ ప్రశ్నించారు. ఇక మద్యాన్ని నియంత్రిస్తున్నామని ప్రభుత్వం ప్రజలకు భ్రమలు కలిగిస్తుందని ఆమె విమర్శించారు. మద్యం షాపులు తగ్గించినా..ధరలు పెంచడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం బాగానే వస్తుందని..ఇదెక్కడి మద్య నియంత్రణ అంటూ భవానీ ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్వహించే మద్యం షాపుల్లో ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె నిరుద్యోగులకు కంపెనీల్లో ఉపాధి కల్పించాల్సిందిగా హితవు పలికారు. అలాగే బెల్ట్ షాపులకు మద్యం పోతుందని, డ్రగ్స్ వాడకం కూడా ఏపీలో పెరిగిపోయిందని ఆరోపించారు. ఈ సందర్భంగా గతంలో లిక్కర్ బ్రాండ్స్ చాలా ఉండేవి..ఇప్పుడు తగ్గిపోయాయి అంటూ భవానీ మాట్లాడుతుండగా స్పీకర్‌తో సహా, సభ్యులంతా ఒక్కసారిగా నవ్వారు. ఆ బ్రాండ్స్ గురించి నీకెందుకు తల్లి…వేరేవాళ్లు మాట్లాడుతారులె అంటూ స్పీకర్ తమ్మినేని నవ్వుతూ భవానీకి సలహా ఇచ్చారు. అయితే భవానీ ఆగలేదు…ప్రస్తుతం అమ్ముతున్న లిక్కర్ బ్రాండ్ల మీద ప్రభుత్వం కమీషన్లు తీసుకుంటుందని పసలేని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ భవానీ తన ప్రసంగం ముగించారు. అయితే ఎన్నికలకు ముందు కూడా జగన్ దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తారని చెప్పారే తప్ప..ఒకేసారి సంపూర్ణ మద్యనిషేధం చేస్తానని హామీ ఇవ్వలేదు..అయినా భవానీ మాత్రం బాబు తరహాలోనే ప్రభుత్వాన్ని గుడ్డిగా విమర్శించారు. ఇది పక్కన పెడితే ఇవాళ ఏపీలో లిక్కర్ బ్రాండ్లు తగ్గిపోయాయంటూ భవానీ చేసిన వ్యాఖ్యలతో సభలో సభ్యులంతా పడీపడీ నవ్వారు. ఆఖరకు స్పీకర్ కల్పించుకుని ఆ బ్రాండ్ల గురిచి నీకెందుకు తల్లి వూరుకో అంటూ..నవ్వుతూ వారించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
