పిల్లల్లో తీవ్ర పోషకాహార లోపాన్ని నివారించేందుకు జాతీయ పోషకాహార సంస్థ సహకారంతో మహిళా-శిశు సంక్షేమ శాఖ రూపొందించిన “బాలామృతం – ప్లస్” పోషకాహారాన్ని ఎన్. ఐ. ఎన్ , తార్నాకలో రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ దక్షిణ రాష్ట్రాల చీఫ్ మిషల్ రాష్డియా(Meital Rusdia) , మహిళా- శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. జగదీశ్వర్, జాయింట్ డైరెక్టర్ అనురాధ, ఎన్. ఐ. ఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత, యూనిసెఫ్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ డాక్టర్ క్యాతి తివారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.ఈ బాలామృతం ప్లస్ పోషకాహారాన్ని పైలట్ ప్రాజెక్టు పద్దతిలో మొదటగా ఆసిఫాబాద్, గద్వాల్ జిల్లాలో అమలు చేస్తున్నారు.
ఈ సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ”సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలు, బాలికల కోసం మన రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.సీఎం కేసీఆర్ ఒక తండ్రిలా ఆలోచించి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.దేశవ్యాప్తంగా ఉండాల్సిన స్థాయిలో తల్లులు బరువు, ఎత్తు లేరు అని సర్వేలు చెబుతున్నాయి. తల్లులు ఆరోగ్యంగా లేకపోవడం వల్ల పిల్లలు కూడా అలాగే ఉండే ప్రమాదం ఉంది.దీన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ పిల్లలు పుట్టిన తర్వాత కాకుండా బిడ్డ గర్భంలో ఉన్నపుడే వారికి పోషకాహారాన్ని అందించాలని నిర్ణయించారు.అందులో భాగంగానే తల్లులు పనిచేయకుండా ఉండాలని వారికి నెలకి2 వేల చొప్పున 6 నెలల పాటు 12వేల రూపాయలు, ప్రసవం తర్వాత కేసీఆర్ కిట్ ఇస్తున్నారు. వీటితో పాటు అంగన్వాడీ ల ద్వారా పోషకాహారాన్ని, కావలసిన మందులు కూడా అందిస్తున్నారు.గర్భిణీ స్త్రీలు నొప్పులు రాగానే ప్రభుత్వ హాస్పిటల్ లో ప్రసవం జరిగేలా అమ్మ ఒడి వాహనం పెట్టి తీసుకొస్తున్నారు. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి మళ్ళీ ఇంటికి అదే వాహనంలో జాగ్రత్తగా చేర్చుతున్నారు.ఇటీవల కేంద్ర ప్రభుత్వ మంత్రులని కలిసినప్పుడి దేశ వ్యాప్తంగా డ్రాప్ ఔట్స్ లేవని చెబుతున్నారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్షేత్ర స్థాయిలో ఉన్న వాస్తవాలను వారి దృష్టి కి తీసుకెళ్ళాం. అయితే కేంద్ర ప్రభుత్వం నేడు విద్యా సంస్థల్లో డ్రాప్ ఔట్స్ ఉన్నాయని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు.
ఆర్థిక మాంద్యం ఉన్న పరిస్థితుల్లో భవనాలు, రోడ్లు కట్టడం ఆపి అయినా, పిల్లలు, తల్లులకు ఇచ్చే ఆహారం విషయంలో ఎలాంటి కొరత ఉండొద్దని సీఎం కేసీఆర్ గారు ఆదేశించారంటే వారి మంచి మనసుకు, మానవత్వానికి నిదర్శనం.మనం ఈరోజు బాలామృతం ప్లస్ విడుదల చేయడమే కాకుండా దీనిని సమర్థవంతంగా లబ్దిదారులకు అందించాలి. ఈ పనిలో అందరిని భాగస్వామ్యం చేయాలి.దేశంలో తెలంగాణని ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు మనం అనేక విషయాల్లో ముందున్నాం.. ఇదొక శుభ పరిణామం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనసు పెట్టి చేయడం వల్లే ఇది సాధ్యం అవుతుంది.కల్యాణ లక్ష్మీ పథకం వల్ల రాష్ట్రంలో బాల్య వివాహాలు బాగా తగ్గడం ఆయన లోతైన ఆలోచనకు నిదర్శనం.కేంద్ర ప్రభుత్వం మహిళా-శిశు సంక్షేమ శాఖ కు బడ్జెట్ సగానికి సగం తగ్గించినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం ఇంకా ఈ శాఖకు బడ్జెట్ రెండింతలు పెంచి నేను ఉన్నానని హామీ ఇస్తున్నారు.ఇలా బడ్జెట్ కేటాయించినప్పుడు ఆయన ఆశించిన ఫలితాలు కూడా తీసుకువచ్చేలా మనం అందరం పని చేయాలని కోరుతున్నాను” అని అన్నారు.
మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ”మహిళ శిశు సంక్షేమ శాఖ ఎంత బాగా పనిచేస్తే నాకు అంత మంచి పేరు వస్తది.రోగం వచ్చిన తర్వాత నయం చేయడం ఖర్చుతో కూడుకున్నది.రోగం రాకుండా చేస్తే సమాజం ఆరోగ్యంగా ఉంటది. అపుడే ఆరోగ్య తెలంగాణ వస్తది అనే స్వార్థం నాది.ప్రపంచంలో ఎక్కడలేని రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న దేశం మనది.స్వాతంత్య్రం తెచ్చుకొని 72 సంవత్సరాలు అవుతున్నా ఇంకా కూడా పౌష్టికాహార లోపం గురించి మాట్లాడుకోవడం బాధించే అంశం.మన రాష్ట్ర తొలి బడ్జెట్ రూపకల్పన లో నేను ఆర్థిక మంత్రి గా ఉన్నపుడు మనం కేటాయించే బడ్జెట్ లో మనిషి కనపడాలి, వారి జీవితం కనపడాలి అని సీఎం గారు చెప్పారు. ఈ చర్చ జరుగుతున్నప్పుడు కేంద్రం చైల్డ్ వెల్ఫేర్ బడ్జెట్ వస్తుంది. అయితే గత బడ్జెట్ కంటే తక్కువ కేటాయించారు. దాంతో మన రాష్ట్ర బడ్జెట్ లో ఈ శాఖకు రెండింతలు పెంచి కేటాయించారు సీఎం కేసీఆర్ .ఆరోగ్య సమాజం కావాలంటే తల్లి ఆరోగ్యంగా ఉండాలి అందుకోసం అంగన్వాడీ కేంద్రాల్లో 15 గుడ్లు ఉంటే తెలంగాణ వచ్చాక 30 గుడ్లకు పెంచుకున్నాం. పాలు 200 ఎం.ఎల్ ఇస్తున్నాం.
మొదటిసారిగా పెద్ద ఎత్తున గుడ్లు, పాలు ఇవ్వాలని నిర్ణయించి, అమలు చేస్తున్నాం. దీనివల్ల కొంత ఉపశమనం లభిస్తుందని భావించిన రాష్ట్రం మనది. ఇదంతా అమలు చేసేది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కాబట్టి వారి వేతనాలు కూడా పెంచుకున్నాం.తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య తెలంగాణ సాధించడంలో భాగంగా రోగం వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే రోగం రాకుండా ఉండేందుకు నివారణ చర్యలు, ఆరోగ్య పరిరక్షణ ప్రోత్సాహక చర్యలు ఉండాలని భావించి ఈ ఆహారం అందిస్తున్నాం.ఒక్కోసారి పేదరికంలో జన్యు సంబంధ వ్యాధులతో పుడితే ఆ తల్లిదండ్రులకు వారికి కంటి మీద కునుకు ఉండదు. అందుకే సీఎం కేసీఆర్ గారు ఇలాంటి పరిస్థితి ఉండొద్దు అని గర్భిణీ స్త్రీలు పని చేయొద్దని, మంచి ఆహారం తీసుకోవాలని 12 వేల రూపాయలు ఇస్తున్నారు. డబ్బుల మొఖం చూసి కాదు,, మనిషి మొఖం చూసి ఇస్తున్నారు.
మిషన్ కాకతీయ తో పర్యావరణ సమతుల్యత కాపాడిన రాష్ట్రం మనది.డ్రింకింగ్ వాటర్, హరితహారం నివారణ చర్యల్లో భాగం.కల్యాణ లక్ష్మి అనేది బాల్య వివాహాలు రూపుమాపుతున్న గొప్ప కార్యక్రమం.యూనిసెఫ్, నీతిఆయోగ్ ప్రభుత్వాలతో కలిసి సమర్థవంతంగా పనిచేయాలి.ఆరోగ్య, విజ్ఞాన తెలంగాణ వల్లే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని నమ్మిన సీఎం కేసీఆర్ గారు.సాటి మనిషికి సాయం చేస్తున్నామని ఆలోచన ఉన్న ఉద్యోగులు ఈ శాఖలో ఉండాలి. గడువు తేదీ అయిపోయిన తర్వాత ఆహారం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. గుడ్లు ఇచ్చేటప్పుడు, పాలు ఇచ్చేటప్పుడు అవి మంచిగా ఉన్నాయో లేవో చూసుకోవడం చాలా ముఖ్యం.ఆరోగ్యం కోసం ఇచ్చే ఆహార పదార్థాలు గడువు ముగిసి ఆనారోగ్యం కు కారణం కాకూడదు.అర్బన్ పేదరికం చాలా భయంకరమైనది. ఇక్కడి బస్తీల పిల్లలకు ఇది ఉపయోగపడేలా చూడాలి.తెలంగాణ రాష్ట్రం దేశంలో ఈ కార్యక్రమం అమలు చేస్తున్న ఆదర్శ రాష్ట్రం గా ఉండాలి అని ఆశిస్తున్నాను”అని అన్నారు.