2014 రాష్ట్ర విభజన తరువాత రాజధాని ఏర్పాటు, ఆర్ధిక లోటు సమస్యలతో పాటు మరోవైపు గత ప్రభుత్వం విచక్షణ లేని అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను 15వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడమే కాకుండా కొత్తగా అప్పులు చేసే వెసులు బాటు లేని స్థితిలోకి నెట్టిన వైనాన్ని, రూ.39,423 కోట్ల విలువైన 2,72,266 బిల్లులను పెండింగ్‌లో పెట్టి వెళ్లిపోవడం వల్ల ప్రస్తుత ఏడాది బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడిందని ఆర్ధిక సంఘానికి వివరించే యోచనలో ఉన్నది. ఈ కారణాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ, సామాజిక కార్యక్రమాల అమలు తీరును వివరించి సాయం కోరనున్నట్లు తెలిపింది. దీనితో పాటుగా కేంద్రానికి రాష్ట్రం చెల్లించాల్సిన అప్పులను మాఫీ చేయాలని విజ్ఞప్తి చేయనున్నది. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ లోటు భర్తీ, నూతన గ్రాంటును కొనసాగించాలని, ఆంధ్రప్రదేశ్‌ను జనరల్ కేటగిరీగా కాకుండా ప్రత్యేకంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం వినతిని తెలియజేయనున్నది. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.