తెలంగాణలో మహిళా శిశుసంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, వారికోసం అనేక పథకాలు అమలుచేస్తున్నారని మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. చిన్నారులు తల్లిగర్భంలో ఉన్నప్పుడే వారికి పౌష్టికాహారం లభించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని అన్నారు. గర్భవతులైన మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అనేక పధ కాలు అమలుచేస్తోందన్నారు. సోమవారం తార్నాకలోని ఎన్‌ఐఎన్‌లో బాలామృతంప్లస్ పథకాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, మంత్రి సత్యవతి కలిసి ప్రారంభించారు.
ఈసందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గర్భవతులు పనిచేయకూడదనే వారికి నెలకు 2వేల రూపాయల చొప్పున ఆరు నెలల పాటు 12వేల రూపాయలు,ప్రసవం తర్వాత కేసీఆర్‌కిట్ ఇస్తున్నారని అన్నారు. వీటితోపాటు అంగన్‌వాడీల ల ద్వారా పోషకాహారాన్ని, అవసరమైన మందులు కూడా పంపీణీ చేస్తున్నారని అన్నారు. గర్భిణి స్ర్తీలకు నొప్పులు రాగానే అమ్మ ఒడి వాహనం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా చేర్పిస్తున్నారు. ప్రసవం జరిగితే మరిన్ని పథకాలు వారి కోసం అమలు జరుగుతున్నాయని తెలిపారు.