వేరుశెనగ ఉత్పత్తి, మార్కెటింగ్‌ల్లో రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో రాష్ట్రం చరిత్ర సృష్టించబోతోందని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు . వనపర్తి జిల్లా వ్యవసాయ శాఖ, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సంయుక్తాధ్వర్యంలో జిల్లా కేంద్రంలో “ ‘వేరుశెనగ సాగు, మార్కెటింగ్’పై నిర్వహించిన జిల్లాస్థాయి రైతు అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతులు ప్రతి నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి విత్తన మార్పిడి చేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. ఆదాయం వచ్చే పంటల వైపు రైతులను మళ్ళించడం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. రైతులు శాస్త్రీయ పద్దతుల్లో వ్యవసాయానికి ముందుకు రావాలని కోరారు. రాబోయే రోజుల్లో ఆయిల్ ఫామ్ పంట సాగుకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. ఈ పంటల సాగుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 50 వేల ఎకరాలలో ఆయిల్ ఫామ్ పండిస్తే కేంద్ర ప్రభుత్వం తొలి పంటకు సబ్సిడీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. రాబోయే నాలుగు సంవత్సరాల్లో బీచుపల్లి ఆయిల్ మిల్ ద్వారా ముందుగా వేరుశెనగ నూనె తయారీ, ఆ తర్వాత పామాయిల్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు.
