గత ఐదేళ్లలో టీడీపీ హాయంలో జరిగిన అవినీతిలో భాగమైన ఓ కీలక అధికారిని జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది. దీంతో చంద్రబాబు అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నాడు. చంద్రబాబు హయాంలో కేంద్రం నుంచి డిప్యుటేషన్‌గా వచ్చిన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ని నాటి ప్రభుత్వం ఎకనమిక్ డెవలన్‌మెంట్ బోర్డ్ సీఈవోగా నియమించింది. చంద్రబాబు అండ చూసుకుని సదరు అధికారి అడ్డగోలుగా భూకేటాయింపులు, నిధుల దుర్వినియోగం, ఉద్యోగ నియామకాలతో సహా అనేక అవినీతిపనులకు కేంద్ర బిందువుగా మారాడు. అయితే తాజాగా పరిశ్రమలు, మౌలిక వసతులశాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న జగన్ సర్కార్ సదరు అధికారిని అవినీతి ఆరోపణలపై సస్పెండ్ చేసి, విచారణ చేపట్టాలని సీఐడీ, ఏసీబీ డీజీలను ఆదేశించింది. అంతే కాదు ఆ విచారణ 6 నెలల్లో పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించింది. విచారణ పూర్తయ్యే వరకు కృష్ణ కిశోర్ అమరావతి విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. ఈ సస్పెన్షన్‌పై టీడీసీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించాడు. కేంద్రం నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారిని సస్పెండ్ చేసే అధికారం జగన్‌కు లేదని చంద్రబాబు గగ్గోలు పెట్టాడు. అలాగే అధికారులను కావాలనే ప్రభుత్వం బదిలీలు చేస్తూ…కక్షసాధింపులకు పాల్పడుతుందని ఆరోపించాడు. చంద్రబాబు విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఈ రాష్ట్రంలో పుట్టడం దురదృష్టకరమని ఆయన అన్నారు. బాబు ఓ నెగిటివ్ మనిషని, గతంలో తొమ్మిదేళ్లు, మొన్న ఐదేళ్లు రాష్ట్రానికి ఆయన చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. అంత అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి తిరోగమనం పట్టించే విధంగా పయనిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేయడం సాధారణమని, దానిని రాజకీయం చేయడం తగదన్నారు. జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉంటే, ఓర్వలేక ఎలాగైనా అడ్డుకోవాలని కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకువస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో పదేపదే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. మొత్తంగా ఒక అధికారిని అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం సస్పెండ్ చేస్తే..వెనకేసుకువస్తున్న చంద్రబాబుపై విజయసాయిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
