పసుపు బోర్డు సాధనలో విఫలమైన బీజేపీ ఎంపీ అరవింద్ రాజీనామా చేయబోతున్నారా..త్వరలో నిజామాబాద్ పార్లమెంట్‌కు బై ఎలక్షన్స్ రానున్నాయా…ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామల నేపథ‌్యంలో నిజామాబాద్ పార్లమెంట్‌కు బై ఎలక్షన్స్ వచ్చే సూచనలు మెండుగానే కనిపిస్తున్నాయి. లోకసభ తనను ఎన్నికల్లో గెలిపిస్తే పసుపు బోర్డును 5 రోజుల్లో తీసుకువస్తా అన్న హామీతో ప్రజలను, రైతులను మభ్యపెట్టి గెలుపొందిన బీజేపీ ఎంపీ అరవింద్ తర్వాత మాట మార్చాడు. పసుపు బోర్డుపై రైతులు ఎంత ఒత్తిడి చేసినా పట్టించుకోలేదు సరి కదా..అసలు పసుపు బోర్డు అవసరం లేదంటూ… బీజేపీ కార్యకర్తలతో సంతకాలు పెట్టించి పసుపు రైతుల పేరుతో లేఖలు అందించే కుటిల ప్రయత్నాలు చేశాడు. అరవింద్ తీరుపై పసుపు రైతులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
తాజాగా పసుపు రైతులకు బోర్డు కన్నా మంచి పరిష్కారం కోసం కేంద్రం నిర్ణయం తీసుకుందని అరవింద్ చెప్పుకొచ్చాడు.. బోర్డుల వల్ల పంటలకు న్యాయం జరగడం లేదని, త్వరలో కొన్ని బోర్డులు రద్దు అయ్యే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పసుపు పంటకి బోర్డుతో ఉండే అధికారాలతో పాటు, సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనుందని, ఓ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ఈ సంస్థ పని చేస్తుందని అరవింద్ చెప్పుకొచ్చాడు. మొత్తంగా పసుపు బోర్డుపై అరవింద్ చేతులెత్తేశాడు. కేంద్రం నిజామాబాద్‌లో పసుపుబోర్డు ఏర్పాటుకు ఏ మాత్రం సుముఖంగా లేదని అర్థమైపోయింది. దీంతో అరవింద్ పసుపు బోర్డుతో సమానమైన సమన్వయ కమిటీ అంటూ మరోసారి రైతులను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేశాడు. పసుపు బోర్డుపై సాధనపై అరవింద్ పూర్తిగా చేతులెత్తేయడంతో పసుపు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నన్ను గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తా, లేకుంటే రాజీనామా చేస్తా.. అవసరమైతే బాండ్ పేపర్ రాసిస్తా అని అరవింద్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పసుపు బోర్డు సాధ్యం కాదని అరవింద్ తేల్చేశాడు. ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు సాధనలో విఫలమైన అరవింద్ రాజీనామా చేయాలంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అరవింద్ రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో త్వరలోనే నిజామాబాద్ పార్లమెంట్‌కు బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు జిల్లాలో చర్చ జరుగుతోంది. మరి పసుపు బోర్డు సాధనలో విఫలమైన అరవింద్ రాజీనామా చేస్తాడా లేడా అన్నది తెలియాల్సి వుంది.