వన జాతరకు రంగం సిద్ధమవుతుంది. మేడారం జాతర తేదీలు ఖరారు కావడంతో అన్ని రకాల ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతుంది. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరుగుతుందని పూజారుల సంఘం ప్రకటించింది. అయితే జనవరి 25 నుంచే మేడారంలో సమ్మక్కసారక్క జాతర సందడి మొదలుకానుంది. జాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ జాతర ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ. 75 కోట్లు విడుదల చేసింది. తాజాగా మేడారం జాతర వివరాలను మంత్రి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అతిరుద్ర యాగంతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ స్పూర్తితో ఇలాంటి యాగాలు జరగడం లోక కళ్యాణానికి దోహదపడుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడి చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలోని కోటిన్నర మాగానికి సాగునీళ్లు అందనున్నాయన్నారు. కాళేశ్వరంతో పాటు మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇదే విషయమై ఇటివలే మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో పలువురం కలిసి కేంద్ర మంత్రులను కూడా కలిశామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కాగా ఫిబ్రవరిలో నిర్వహించనున్న మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మేడారం జాతరలోని అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కూడా జాతరను వైభవంగా నిర్వహిస్తామని ఇంద్రకరణ్ వెల్లడించారు.మొత్తంగా మేడారం జాతరకు ఇంకా నెలన్నరకు పైగా సమయం ఉన్నా, ప్రభుత్వం ఇప్పటినుంచే ఏర్పాట్లను షురూ చేస్తోంది.
