టీడీపీ అధినేత చంద్రబాబు పొద్దున లేస్తే 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేను, దేశంలోనే నా అంత సీనియర్ లీడర్ లేడు..అపర చాణక్యుడిని అంటూ గొప్పలు చెప్పుకుంటాడు..అయితే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యూహం ముందు 40 ఏళ్ల బాబుగారి అనుభవం ఎందుకు పనికిరాకుండా పోయింది. టీడీపీకి రాజీనామా చేసిన సందర్భంగా వల్లభనేని వంశీ చంద్రబాబు, లోకేష్‌లపై పరుషపదజాలంతో విమర్శలు చేశారు. వంశీ విమర్శలపై టీడీపీ నేతలు కూడా మండిపడ్డారు. దీంతో విమర్శ, ప్రతి విమర్శలతో వంశీకి, పార్టీకి మధ్య వివాదం మరింతగా ముదిరిపోయింది. ఓ టీవీ ఛానెల్ డిబెట్‌లో టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర, వంశీల మధ్య జరిగిన బూతు సంవాదం టీడీపీ పరువును నడిబజారున పడేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ముందూ, వెనుక ఆలోచించకుండా వంశీని పార్టీని నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక్కడే వంశీ వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. ఇటు రాజీనామా చేయకుండానే, అటు వైసీపీలో చేరకుండానే వంశీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. పార్టీ సస్పెషన్షన్ వేటు వేయడంతో వంశీ డిస్‌క్వాలిఫై అయ్యే అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్యే పదవికి వచ్చిన ఢోకా ఏమి లేదు. మరో వైపు వైసీపీలో చేరకుండానే..ఆ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. టీడీపీకి రాజీనామా చేశారు కాబట్టి…ఆ పార్టీ నేతలతో కలిసి కూర్చోవడం లేదు. దీంతో వంశీని స్వతంత్ర్య ఎమ్మెల్యేగా పేర్కొంటూ..అసెంబ్లీలో ప్రత్యేక స్థానం కేటాయించారు. పార్టీ మారలేదు కాబట్టి ఫిరాయింపు చట్టం కింద వంశీని డిస్‌క్వాలిఫై చేసే అవకాశం లేదు. తద్వారా ఉప ఎన్నికల సమస్యను వంశీ తెలివిగా తప్పించుకున్నారు. ఇలా కొన్నాళ్లపాటు వంశీ స్వతంత్ర్య ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఉంది.ఇదే ఫార్ములాతో టీడీపీకి చెక్‌పెట్టేందుకు వైసీపీ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. వంశీ తరహాలోనే మరి కొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి, చంద్రబాబు, లోకేష్‌లపై దుమ్మెత్తిపోసి, సస్పెండ్ చేయించుకుని, స్వతంత్ర ఎమ్మెల్యేలుగా కొనసాగేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. తద్వారా అనర్హత వేటు తప్పించుకోవడమే కాకుండా…తమ పదవుల్లో కొనసాగే అవకాశం ఉంటుందని, అలాగే అనధికారికరంగా వైసీపీ ఎమ్మెల్యేలుగా కొనసాగవచ్చని..వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 48 ఏళ్ల వంశీ రాజకీయ చతురత ముందు..అపర చాణక్యుడిని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబుగారి అనుభవం ఏ మాత్రం పనికిరాకుండా పోయిందనే చెప్పాలి.
