జనసేన పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పని చేసిన నాయకులంతా ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆకుల సత్యనారాయణ, పార్థసారథి, బాలరాజు వంటి నేతలు, అద్దేపల్లి శ్రీధర్ వంటి స్సోక్స్ పర్సన్ పార్టీని వీడగా..తాజాగా పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహిత మిత్రుడు, జనసేన వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన రాజు రవితేజ రాజీనామా చేశారు. రాజురవితేజ జనసేన పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించాడు. పవన్ కల్యాణ్ పార్టీని ప్రారంభించినప్పటి నుంచి రాజు రవితేజ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అసలు తాను రాజకీయ పార్టీని ప్రారంభించడానికి ప్రేరణ ఇచ్చిన ఒకే ఒక్క వ్యక్తి రాజు రవితేజ అని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పుకున్నారు. జనసేన పార్టీ రాజ్యాంగంగా చెప్పుకునే పవనిజం పుస్తకాన్ని రచించింది రాజు రవితేజ కావడం గమనార్హం. తొలుత జనసేన పార్టీ తొలి ప్రధాన కార్యదర్శిగా పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన రాజు రవితేజా ప్రస్తుతం పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా పవన్ కల్యాణ్ తీరుపై రాజు రవితేజ రగిలిపోతున్నారు. మతం, కులం లేదంటూనే మత, కుల విద్వేషాలను రగిలిస్తున్న పవన్ వైఖరికి సహించలేని రాజురవితేజా పార్టీకి రాజీనామా చేశాడు. ఈ మేరకు పవన్ కల్యాణ్‌ను ఘాటుగా విమర్శిస్తూ..ఓ లేఖ రాశాడు..ఆ లేఖ రాజు రవితేజ మాటల్లో యథాతథంగా..మీ కోసం
ప్రకటన
పవన్ కల్యాణ్ – జనసేన పార్టీ
శ్రీ పవన్ కల్యాణ్ గారితో కానీ, జనసేన పార్టీతో కానీ ఇక నుండి నాకు ఎటువంటి సంబంధం ఉండబోదని, అందరూ గమనించాలని నేను కోరుతున్నాను. పార్టీ భావజాలం మరియు పార్టీ రాజ్యాంగాన్ని సృష్టించి, పార్టీని ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించిన మొదటి ప్రధాన కార్యదర్శిని నేనే. ప్రస్తుతం నేను పోలిట్‌బ్యూరో సభ్యుడిని, శ్రీ కల్యాణ్ గారి కోరిక మేరకు నేను ఆ పదవి ఇష్ట లేకపోయినా అంగీకరించాను. ఇక మీదట నేను శ్రీ కల్యాణ్ గారితో కలిసి పని చేయను, అతనితో లేదా జనసేన పార్టీతో సంబంధం కలిగి ఉండను. ఒకప్పుడు మంచి వ్యక్తి అయిన పవన్ కల్యాణ్ గారు కక్షసాధింపుతనం మరియు మతపరమైన ద్వేషంతో నడిచే ప్రమాదకరమైన విభజన శక్తిగా మారిపోయాడు..రాజకీయ లేదా సామాజిక శక్తి ఉన్న పదవిని ఆక్రమించటానికి అతడిని అనుమతించకూడదు. శ్రీ కల్యాణ్ గారు ఎటువంటి రాజకీయ అధికారానికి అర్హుడు కాదు. అర్హత లేకుండా పొందినది, అనుమతి లేకుండా పోతుంది. అంటూ రాజు రవితేజా పార్టీని వీడుతూ రాసిన లేఖ జనసేన పార్టీలో కలకలం రేపింది. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌ను మతపరమైన ద్వేషాన్ని రగిలిస్తున్న విభజనశక్తి గా పోల్చుతూ రాజు రవితేజ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి. ప్రస్తుతం పవన్ మతం పేరుతో చేస్తున్న రాజకీయాలు, విమర్శలు చూస్తుంటే..రాజు రవితేజ చేసిన వ్యాఖలు నిజమే అనిపిస్తుంది. పార్టీ స్థాపనకు కారకుడైన రాజు రవితేజ రాజీనామా చేయడం చూస్తుంటే..త్వరలోనే జనసేన పార్టీ మూసివేయడం కానీ లేదా.. పార్టీని పవన్ బీజేపీలో విలీనం చేయడం కానీ కచ్చితంగా జరుగుతాయనిపిస్తుంది. మొత్తంగా రాజు రవితేజ దూరం కావడం జనసేన పతనానికి నాంది అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.