వైఎస్సార్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం చేసింది. ఈమేరకు ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌కు 3,148.68 ఎకరాల భూమిని ముందస్తుగా అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. ఈమేరకు వైఎస్సార్ జిల్లా కలెక్టర్‌కు అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయుటజరిగింది. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దండ్లూరు, సున్నపురాళ్లపల్లి గ్రామాల పరిధిలో 3148.68 ఎకరాల భూమిని జీవో–571 ప్రకారం ఎకరా రూ.1.65 లక్షల ధరతో కేటాయించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. భూమిని ఏపీ హైగ్రేడ్ స్టీల్స్‌కు ముందస్తుగా అప్పగించాలని గత నెల 27న మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తక్షణమే ఏపీ హైగ్రేడ్ స్టీల్స్‌కు భూమిని అప్పగించాలని వైఎస్సార్ జిల్లా కలెక్టర్‌ను రెవెన్యూ శాఖ కార్యదర్శి వి.ఉషారాణి ఉత్తర్వులు జారీచేశారు. భూకేటాయింపునకు వీలుగా ప్రతిపాదనను త్వరగా భూ యాజమాన్య సంస్థ (ఏపీఎల్‌ఎంఏ)లో ఆమోదించి ప్రభుత్వానికి పంపించాలని ఆమె రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ)ను ఆదేశించారు. ఈనెలలోనే వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖ ఈ ఆదేశాలు జారీ చేశారు.
