మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుటుంబంలో రాజకీయ ఎడబాట్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయ్యన్నపాత్రుడు, సన్యాసి పాత్రులు మధ్య పార్టీ విషయమై వివాదం చోటుచేసుకున్నదని ఒక వార్త వచ్చింది. సన్యాసిపాత్రుడు ఈ మద్య వైసిపిలో చేరిన సంగతి తెలిసిందే. అయ్యన్నపాత్రుడు టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి. వీరిద్దరి మధ్య పార్టీల జెండాల విషయంలో వాగ్వాదం జరిగిందట. వీరిద్దరూ ఒకే ఇంటిలో ఉంటారు. సన్యాసిపాత్రుడు వైసిపి జెండా కట్టడానికి ప్రయత్నించగా, ఆయన పిన్ని ఒకరు అడ్డుకోబోయారు. ఆ గొడవలో ఆమె అస్వస్థతకు గురైందని, దాంతో ఆస్పత్రిలో చేర్చారని చెబుతున్నారు. కాగా జెండా ఇంటిపై పెడుతుండగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారంటూ డయల్ 100కి ఫోన్ చేసి సన్యాసిపాత్రుడు కుమారుడు ఫిర్యాదు చేశారట. ఆ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం కలకలంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు సోదరుల మధ్య నెలకొన్న వివాదం పరిష్కరించే యత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రెండు పార్టీల జెండాలు ఆ ఇంటిపై ఎగురుతుండటంతో అక్కడితో ఆ వివాదం సర్దుమణిగింది. జెండాలతో మొదలైన అన్నదమ్ముల వైరం ఏస్థాయికి చేరుతుందోనని స్థానికులలో చర్చలు మొదలయ్యాయి.