ఏపీలో అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు 21 రోజుల్లో ఉరి శిక్ష పడేలా జగన్ సర్కార్ దిశ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. దిశ బిల్లుపై ఏపీ అసెంబ్లీలో డిసెంబర్ 13, శుక్రవారం నాడు చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ మంచి ఉద్దేశంతో తెచ్చిన బిల్లుకు మద్దతునిస్తానని తెలిపారు. అదే సమయంలో ఏడిఆర్ నివేదిక ఆధారంగా వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు..నలుగురు ఎమ్మెల్యేల పైన కేసులు ఉన్నట్లుగా ఆరోపించారు. బాబు ఆరోపణలపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మరి అచ్చెన్నాయుడు, దేవినేని ఉమపై కేసులున్నాయని గతంలో ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చిందని, వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి చంద్రబాబును ప్రశ్నించారు. తనపై వచ్చిన ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. తనపై ఎలాంటి కేసులున్నా చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసిన అచ్చెన్నాయుడు అసలు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదని ఆరోపించారు. అంతే కాదు మంత్రి కొడాలి నానిపై కూడా అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. చంద్రబాబు, టీడీపీ నేతలపై బూతులు మాట్లాడుతున్న కొడాలి నానికి ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స చేయించాలని, సభలో ఆయన వ్యాఖ్యలు వినలేకపోతున్నామని అచ్చెన్నాయుడు అన్నారు. అయితే అచ్చెం వ్యాఖ్యలకు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ఎద్దులా పెరిగిన అచ్చెన్నాయుడిని వెంటనే వెటర్నరీ ఆస్పత్రిలో చేర్పిస్తే బాగుంటుందని నాని సెటైర్ వేశారు. ముందు అమరావతిలో చంద్రబాబు మానసిక వైకల్య కేంద్రం ఏర్పాటు చేసి టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చాలని ఎద్దేవా చేశారు. ఇక తనకు ఏమీ తెలియదని అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ పలాస ఎమ్మెల్యే అప్పలరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడిలాగా తనకు బాడీ, ఆస్తులు లేవని, బ్రెయిన్ సైజ్ మాత్రం సేమ్ టు సేమ్ అని ఎమ్మెల్యే అప్పలరాజు వ్యాఖ్యానించారు. మొత్తంగా దిశ బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య జరిగిన వాగ్వివాదం కౌంటర్, ప్రతి కౌంటర్ల మధ్య రసవత్తరంగా సాగింది.
