గత ఐదు సంవత్సరాల కాలంలో 10 ఐఐటీ కాలేజీల్లో దాదాపుగా 27మంది విద్యార్థులు తమ ప్రాణాలను బలితీసుకున్నారు. ఇది ఎక్కడో మారుమూల జరిగిన విషయం కాదు.. దేశంలోని ఉన్నత విద్యాసంస్థలలోనే ఈ ఆత్మహత్యలు జరిగాయి.. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ కళాశాలల్లో 2014 నుండి 2019 వరకు మొత్తం 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారంటే అసలు ఐఐటీలో ఏం జరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తం అవుతుంది.
ఇటీవల సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం కింద ఐఐటీలో చనిపోయిన విద్యార్థుల వివరాలకోసం కోరగా.. వెల్లడైన వివరాలు చూస్తే ఐఐటీలలో విద్యార్ధుల మానసిక పరిస్థితి ఎలాఉందో అర్థం చేసుకోవచ్చు. మానవవనరుల అభివృద్ది, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం విద్యార్థుల ఆత్మహత్యలలో గడచిన ఐదు సంవత్సరాలలో ఐఐటి మద్రాస్ మొదటి స్థానంలో ఉంది.. ఆతర్వాత ఐఐటి ఖరగ్‌పూర్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి హైదరాబాద్, ఐఐటి బొంబాయి, ఐఐటి గౌహతి, ఐఐటి రూర్కీ, వారణాసి ఐఐటి, ఐఐటి ధన్‌బాద్, ఐఐటి కాన్పూర్ విద్యాలయాలున్నాయి.
విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అసలు అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారో సమాధానం కూగా దొరకడం లేదు. గత 5 సంవత్సరాలకాలంలో అంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఐఐటీల తీరుపై కూడా పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్ కు పునాదివేయాల్సిన విద్యాలయాలు వాళ్ల చావులకు కారణమవుతున్నాయంటే ఇది కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల ఆత్మహత్యలపై ఆలోచించాల్సిన అవసరం ఉంది.