నష్టాల్లో ఉన్న ఎపిలో ఆర్టీసీని బయటపడేసేందుకు ఏపీ ప్రభుత్వం చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకొనున్నదని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి సవరించిన చార్జీలు అమలులోకి వస్తాయని ఆర్టిసి ప్రకటించింది. పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 20 పైసలు పెంచినట్లు ప్రకటించింది. వీటితోపాటు ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు చార్జీ పెంపు ఉంటుందని సంస్థ వెల్లడించింది. వెన్నెల స్లీపర్ బస్సుల్లో చార్జీల పెంపు లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. అలాగే, సిటీఆర్డినరీ బస్సుల్లో 11 స్టేజీల వరకు చార్జీల పెంపుదల లేదని ఆర్టీసీ తెలిపింది. పల్లెవెలుగులో మొదటి 2 స్టేజీలు అనగా 10 కిలోమీటర్ల వరకు చార్జీల పెంపు లేదని పేర్కొంది. తదుపరి 75 కిలోమీటర్ల వరకు రూ.5 ఛార్జీ పెంపు ఉంటుందని ఆర్టీసీ తెలిపింది. ఈ విధంగానైన ఆర్టీసీకి కొంతవరకు ఊరట లభిస్తుందని భావిస్తున్నారు.
