తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు ప్రణాళికలు రచించి, అమలుచేస్తున్నది. గత సెప్టెంబర్ ఆరో తేదీ నుంచి అక్టోబర్ ఐదో తేదీ వరకు నిర్వహించిన పల్లెప్రగతిలో
గుర్తించిన పనులన్నీ ప్రాధాన్య క్రమంలో చేపడుతున్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోపాటు ఉపాధిహామీ పథకం నిధులను వినియోగిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఉపాధిహామీ పథకం కింద రాష్ట్ర వాటాతో కలిపి దాదాపు రూ.వెయ్యి కోట్లను పల్లెల అభివృద్ధికి ఖర్చుచేయనున్నారు.
ఉపాధిహామీ పథకం లక్ష్యాన్ని నెరవేరుస్తూనే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని పల్లెప్రగతి ప్రణాళికలో పేర్కొన్నారు. పల్లెప్రగతి పనులతోపాటు హరితహారం పనులను ఉపాధిహామీ పథకం కూలీలతోనే చేపడుతున్నారు.పల్లెప్రగతి ప్రణాళిక పనులను పూర్తిచేసేందుకు రూ.430 కోట్లను ఈ ఆర్థిక సంవత్సరంలో వెచ్చించనున్నట్టు గ్రామీణాభివృద్ధిశాఖ వెల్లడించింది. వీటితోపాటుగా పంచాయతీరాజ్‌శాఖ నిధులను కూడా వినియోగించనున్నారు. మౌలిక సదుపాయాల కల్పనతోపాటు గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడానికి ప్రాధాన్యమిస్తున్నారు.
ఇప్పటివరకు రాష్ట్రంలోని 12,249 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటయ్యాయి. 3,864 చోట్ల కంపోస్ట్‌పిట్స్, షెడ్‌తో కూడిన డంపింగ్‌యార్డులు నిర్మించగా.. మరో 8,800 చోట్ల నిర్మాణాలకు సిద్ధమయ్యాయి. 2,644 వైకుంఠధామాల నిర్మాణం పూర్తయ్యేదశలో ఉండగా, మరో 10,120 పనులు చేపట్టారు. ఇప్పటివరకు గ్రామాల్లో 1,35,438 ఇంకుడుగుంతల పనులు తుదిదశకు చేరుకోగా.. మరో 42,52,243 ఇంకుడుగుంతల పనులు జరుగుతున్నాయి. వీటికోసం పల్లెప్రగతి ప్రణాళిక కింద రూ.430 కోట్లు ఖర్చు చేయనున్నారు.