సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ములుగులో నూతనంగా నిర్మించిన అటవీ కళాశాల, పరిశోధన కేంద్రాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణలో సీఎం కేసీఆర్ మొక్క నాటారు. ఈ సందర్భంగా కళాశాలలోని సిబ్బంది, విద్యార్థులతో సీఎం ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తమిళనాడులోని గట్టుపాలయం ఫారెస్ట్ కాలేజీ దేశంలోనే అత్యధిక సంఖ్యలో 120 మంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారులను అందించింది. అంతకంటే ఎక్కువమంది ఐఎఫ్‌ఎస్‌లను తెలంగాణ నుంచి తయారుచేసేందుకు వీలుగా దేశం గర్వించే రీతిలో ఫారెస్ట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భావించిన సీఎం కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా ములుగులో ఫారెస్ట్ కాలేజీ రూపుదిద్దుకున్నది.
ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఫారెస్ట్ కాలేజీని పూర్తిస్థాయి లేదా డీమ్డ్ యూనివర్సిటీగా హోదా పెంచడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో తాత్కాలికంగా కొనసాగుతున్న బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులు నూతన క్యాంపస్‌లోకి మారనున్నాయి. 2020 నుంచి ఎమ్మెస్సీ, పీహెచ్‌డీతోపాటు ఏకకాలంలో ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ కోర్సులను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఫారెస్ట్ కాలేజీ పరిపాలనా భవనాన్ని దాదాపు 12 ఎకరాల పరిధిలో, రెండు లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించారు.
దీని నిర్మాణానికి ప్రభుత్వం రూ.75 కోట్లు మంజూరుచేసింది.గజ్వేల్ నియోజవకవర్గం నర్సంపల్లి రిజర్వ్‌ఫారెస్ట్ బ్లాక్‌లో సువిశాల ప్రాంతంలో పరిపాలనా విభాగం, తరగతి గదులు, సెమినార్ హాల్స్, ల్యాబ్‌లు, హాస్టళ్లు, క్యాంటీన్‌లు, ఆడిటోరియం, రైతు హాస్టళ్లు, గెస్ట్‌హౌస్‌లు, పరిశోధనా విభాగాలను ఏర్పాటుచేశారు. అటవీవనరులు, అటవీ ఉత్పత్తుల యాజమాన్యం, వాటి వాడకం, అటవీ సాంఘిక శాస్త్రం, సామాజికశాస్త్రంతోపాటు వన్యప్రాణి శాస్త్రం, పట్టణాల్లో అడవుల పెంపకం, సుందరీకరణ, సిల్వికల్చర్ విధానాలపై వివిధ విభాగాలుంటాయి