అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్ తమ్మినేని సీతారాంకు, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది. చంద్రబాబు నాయుడు వల్లభనేని వంశీకి మైక్ ఇవ్వడం పట్ల ఆగ్రహించారు. ఇదేం పార్టీ ఆఫీసు కాదని, ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే ఇందుకు స్పీకర్ తమ్మినేని కూడా ఘాటుగా స్పందించారు. ఇది పార్టీ ఆఫీసు కాదని తనకు తెలుసని, గతంలో మీరు ఏం చేశారో అందరికీ తెలుసని ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన ఘటనపై మండిపడ్డారు. ఈ క్రమంలో స్పీకర్ తీరును నిరసిస్తూ టీడీపీ సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ వైసీపీ ఆఫీసన్న విపక్ష నేత మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. సభపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.. అసెంబ్లీ ప్రజల జాగీర్ మాత్రమేనని స్పీకర్ తమ్మినేని స్పష్టం చేశారు. గతంలో సభలో ఎన్టీఆర్‌కు అవకాశం ఇవ్వకపోవడం తప్పేనన్నారు. ఆపాపంలో తానుకూడా భాగస్వామినేనన్నారు. అందుకు 15ఏళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్నానని, తాను చేసిన తప్పును ఒప్పుకుంటున్నట్టుగా స్పీకర్ మాట్లాడారు. ఈక్రమంలో తమ్మినేని భావోద్వేగానికి లోనయ్యారు.
