ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం సెగలు రేపింది. కొద్ది రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన వంశీ చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. వంశీ, టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడిచింది. అయితే తాజాగా అసెంబ్లీలో వల్లభనేని వంశీ వ్యవహారం చర్చకు వచ్చింది. ప్రశ్నోత్తరాల సమయంలో వంశీ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరగా స్పీకర్ అనుమతి ఇచ్చారు. అయితే వంశీకి మాట్లాడే అవకాశం ఇవ్వడం పట్ల చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వంశీ బాబు, లోకేష్, టీడీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌కు వంశీ కీలక ప్రతిపాదన చేశారు. టీడీపీ నుంచి గెలిచిన తాను..జరిగిన పరిణామాలతో ఇక ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగలేనని, తనను సభలో ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని వంశీ కోరారు. తాను నియోజకవర్గంలో మోటార్లకు విద్యుత్ ఇవ్వాలని, అదే విధంగా నివాస స్థలాల గురించి చర్చించేందుకే ముఖ్యమంత్రిని కలువగా ఆయన సానుకూలంగా స్పందించారని వంశీ సభకు వివరించారు. అదే విధంగా ప్రభుత్వం ప్రారంభిస్తున్న ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు తాను మద్దతు పలికానని, అయితే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా మీడియా ద్వారా తెలిసిందని వంశీ అన్నారు. తాను టీడీపీ నుంచి గెలిచినా..ఇక తాను ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉండలేనని, అయితే నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యేగా కొనసాగుతానని వంశీ స్పష్టం చేశారు. వంశీ వ్యాఖ్యలపై చంద్రబాబుతో సహా, టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. దీంతో వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారు..మీకు ఎందుకు అభ్యంతరం..మేము మాట్లాడకూడదా..మాకు హక్కులుండవా అని ప్రశ్నించారు. అదే విధంగా తాను ప్రభుత్వం విధానాలకు మద్దతు ఇవ్వటం పైనా పప్పుబ్యాచ్..కులం పేరుతో..తల్లిదండ్రులను కించపరుస్తూ సోషల్ మీడియాలో తనపై పరుష పదజాలంలో విమర్శలు చేసారని సభకు వివరించారు. పప్పు బ్యాచ్ జనంలో తిరగరని..జయంతికి..వర్దంతికి తేడా తెలియదని లోకేష్‌ను ఉద్దేశిస్తూ.. ఎద్దేవా చేశారు.. అయితే ప్రశ్నోత్తరాల సమయంలో వంశీకి మాట్లాడే అవకాశం ఎలా ఇస్తారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ సభ్యులు లేచి వంశీకి మాట్లాడే అవకాశం ఇవ్వటం పట్ల నిరసన తెలిపారు. ఆ సమయంలో స్పీకర్ సైతం టీడీపీ సభ్యుల కామెంట్ల మీద ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇది టీడీఎల్పీ సమావేశం కాదని వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసంటూ సీరియస్ అయ్యారు. కాగా వంశీ మాట్లాడే హక్కు ఉందని..అవకాశం ఇవ్వాలని మంత్రి బుగ్గన స్పీకర్‌ను కోరగా ఆయన అనుమతి ఇచ్చారు. వంశీకి మాట్లాడే అనుమతి ఇవ్వడం పట్ల చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తూ..సభ నుంచి వాకౌట్ చేశారు. మొత్తంగా శీతకాల అసెంబ్లీ సమావేశాలు తొలిరోజే వల్లభనేని వంశీ వ్యవహారం సభలో కాకరేపింది. మరి వంశీ మున్ముందు బాబు, లోకేష్‌లను ఎలా చెడుగుడు ఆడుతాడో చూడాలి.
